తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పెద్ద నోట్ల రద్దు సరైనదే'.. కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు - supreme court latest news

మోదీ సర్కారుకు ఊరట లభించింది. పెద్ద నోట్ల రద్దు సరైనదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్​బీఐని సంప్రదించిన తర్వాతే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నందున.. ఆ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని పేర్కొంది. ఈ మేరకు తీర్పు వెలువరించింది.

Supreme Court verdict demonetisation
Supreme Court verdict demonetisation

By

Published : Jan 2, 2023, 11:11 AM IST

Updated : Jan 2, 2023, 12:59 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైనదేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు తీర్పు వెలువరించింది. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. ఆర్​బీఐని సంప్రదించిన తర్వాతే కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కార్యనిర్వాహక విధానాన్ని తాము తప్పుబట్టలేమని తెలిపింది. నోట్లరద్దును 4-1తో రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది.

"పెద్దనోట్ల రద్దుపై కేంద్రం నిర్ణయం లోపభూయిష్టంగా లేదు. ఆర్​బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. కాబట్టి కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుపట్టలేం. నోట్ల రద్దు నిర్ణయం లక్ష్యాన్ని చేరుకుందా లేదా అన్నది సంబంధం లేదు. పెద్ద నోట్లు రద్దు చేస్తూ 2016 నవంబరు 8న కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ చెల్లుబాటు అవుతుంది."
-సుప్రీంకోర్టు

కాగా, ఐదుగురు న్యాయమూర్తుల్లో జస్టిస్ బీవీ నాగరత్న.. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆర్​బీఐ చట్టం సెక్షన్ 26(2) ప్రకారం కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. నోట్ల రద్దును చట్టం ద్వారా చేపట్టాల్సిందని.. నోటిఫికేషన్ ద్వారా కాదని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు.

"ఆర్​బీఐ నుంచి కేవలం అభిప్రాయం మాత్రమే తీసుకున్నారు. దీన్ని సిఫార్సుగా భావించలేం. గెజిట్ నెటిఫికేషన్ ద్వారా నోట్ల రద్దు ప్రక్రియ చేపట్టాల్సింది కాదు. నోట్ల రద్దుపై పార్లమెంట్​లో చట్టం చేయాల్సింది. దేశం మొత్తానికి ముఖ్యమైన ఇలాంటి నిర్ణయం విషయంలో పార్లమెంట్​ను విస్మరించడం తగదు. నోట్ల రద్దు అనేది చట్టవిరుద్ధమైన నిర్ణయం."
-బీవీ నాగరత్న, సుప్రీంకోర్టు న్యాయమూర్తి

కేంద్ర ప్రభుత్వం 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 58 పిటిషన్లు దాఖలయ్యాయి. 2016 డిసెంబర్ 16న అప్పటి సీజేఐ టీఎస్ ఠాకూర్.. ఈ వ్యాజ్యాల విచారణను ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించిన రికార్డులను అందజేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐలను గత డిసెంబరు 7న ఆదేశించింది. కేసు విచారణ సందర్భంగా అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణితోపాటు పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది పి.చిదంబరం, మరికొందరు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

Last Updated : Jan 2, 2023, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details