Supreme Court On Pregnancy Termination : 26 వారాల గర్భాన్ని ఓ వివాహిత తొలగించుకునేందుకు ఇచ్చిన అనుమతిని రీకాల్ చేయాలంటా కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పును వెలువరించింది. అబార్షన్‌కు అనుమతించడాన్ని ఒకరు విముఖత వ్యక్తం చేయగా.. మరొకరు సదరు వివాహిత నిర్ణయాన్ని గౌరవించాలంటూ వ్యాఖ్యలు చేశారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనానికి సిఫార్చు చేయాలని సూచించారు.
తన గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలని కోరుతూ ఇద్దరు పిల్లలున్న ఓ వివాహిత ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాను కుంగుబాటుతో బాధపడుతున్నానని, మూడో చిన్నారిని పెంచేందుకు ఆర్థికంగా, మానసికంగా సిద్ధంగా లేనని పేర్కొన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు.. ఎయిమ్స్ వైద్యుల నివేదిక మేరకు ఆ వివాహిత గర్భ విచ్ఛిత్తికి అక్టోబర్ 9న అనుమతిచ్చింది.
అప్పటికే గర్భిణీకి 25 వారాలు దాటడం వల్ల కేంద్రం సుప్రీంను ఆశ్రయించింది. ఈ క్రమంలో వివాహితను పరిశీలించిన వైద్య బృందం.. పిండం బతికి ఉండే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయంటూ తాజా నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని ఆశ్రయించగా.. గర్భవిచ్ఛిత్తిని తాత్కాలికంగా వాయిదా వేయాలని అక్టోబర్ 10న ఎయిమ్స్ వైద్యులను ఆదేశించింది. తాజాగా ఈ కేసును జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీం ధర్మాసనానికి సిఫార్సు చేయగా.. బుధవారం విచారణ చేపట్టింది.
'కచ్చితంగా అప్పుడెందుకు చెప్పలేకపోయారు?'
Supreme Court Latest News Today : ఈ సందర్భంగా గర్భ విచ్ఛిత్తి వల్ల మహిళకు ఎటువంటి సమస్య ఉండదని వైద్యులు తొలుత ఇచ్చిన నివేదికను సుప్రీం ధర్మాసనం ప్రస్తావించింది. వైద్యులు ఇచ్చిన తాజా నివేదిక పట్ల సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. గర్భస్థ శిశువు బతికి ఉండే అవకాశాల గురించి ఇంత కచ్చితంగా అప్పుడెందుకు చెప్పలేకపోయారు? అని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీని ప్రశ్నించింది.