చంద్రబాబు క్వాష్ పిటిషన్ - సీజేఐకి నివేదించిన ద్విసభ్య ధర్మాసనం
Published : Jan 16, 2024, 1:19 PM IST
|Updated : Jan 16, 2024, 9:59 PM IST
12:45 January 16
ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు
Chandrababu Quash Petition: తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై సీఐడీ నమోదుచేసిన స్కిల్ డెవెలప్ మెంట్ కేసులో కీలకంగా మారిన, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A అంశం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయానికి వెళ్లింది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. సీఐడీ 17A నిబంధనలు ఉల్లంఘించిందని జస్టిస్ బోస్ తీర్పు అభిప్రాయపడగా చట్టసవరణ తర్వాత కేసులకే 17A వర్తిస్తుందని జస్టిస్ త్రివేది పేర్కొన్నారు. వేర్వేరు అభిప్రాయాలు ఉన్నందున తగిన మార్గదర్శకాల కోసం సీజేఐకు నివేదించారు.
స్కిల్ కేసులో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ క్వాష్ చేయాలన్న చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువరించారు. గత ఏడాది అక్టోబర్‌లో విచారణ జరిపిన ధర్మాసనం, అదే నెల 17న తీర్పు రిజర్వ్ చేసింది. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న తీర్పును జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా M త్రివేది రెండు వేర్వేరు తీర్పులను వెలువరించారు. అవినీతి నిరోధక చట్టం, 1988కి 2018లో సవరణ ద్వారా సెక్షన్ 17A తీసుకువచ్చారని, ఈ నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత, ఎంక్వరీ, ఇంక్వయిరీ లేదా దర్యాప్తు ఆ నిబంధనకు అనుగుణంగానే జరపాలని జస్టిస్ అనిరుద్ధ బోస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేశాడని భావిస్తే, అవినీతి నిరోధక చట్టం ప్రకారం తగిన అనుమతులు తీసుకునే దర్యాప్తు చేపట్టాల్సి ఉంటుందని, అలా జరగని పక్షంలో అది చట్ట విరుద్ధం అవుతుందన్నారు. 1988 అవినీతి నిరోధక చట్టంలోని 13(2)లో సెక్షన్ 13(1)(సి), 13(1)(డి) ప్రకారం ముందస్తు అనుమతులు తీసుకోలేనందున, చంద్రబాబు నాయుడు పై ఆ సెక్షన్‌ల కింద తదుపరి చర్యలు తీసుకునే అధికారం లేదని జస్టిస్ అనిరుద్ధ బోస్ తన తీర్పులో అభిప్రాయపడ్డారు. సంబంధిత అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దరఖాస్తు చేసుకుని, అందుకు తగిన అనుమతి పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ 10న ట్రయల్ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయడానికి నిరాకరించారు. రిమాండ్ ఆర్డర్‌ను జారీ చేసే అధికారం ట్రయల్ కోర్టుకు ఉందన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ఐపీసీ సెక్షన్‌ల కింద పెట్టిన కేసుల విచారణార్హతను సవాలు చేస్తూ, ట్రయల్ కోర్టు ముందు దరఖాస్తు దాఖలు చేసుకునే స్వేచ్ఛ చంద్రబాబుకు ఇస్తున్నామని స్పష్టం చేవారు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను పాక్షికంగా అనుమతిస్తున్నట్లు జస్టిస్ బోస్ తన తీర్పులో పేర్కొన్నారు.
జస్టిస్ అనిరుద్ధబోస్ తీర్పుతో, ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేది విభేదించారు. సెక్షన్ 17A నిబంధన చంద్రబాబు విషయంలో వర్తించదని అభిప్రాయపడ్డారు. అవినీతి నిరోధక చట్టానికి 2018లో గణనీయమైన సవరణలు చేశారని, సవరించిన, కొత్తగా చేర్చిన సెక్షన్‌ల ప్రకారం 2018 తర్వాత జరిగిన నేరాలకు మాత్రమే సెక్షన్ 17A వర్తిస్తుందని జస్టిస్ బేలా త్రివేది తన తీర్పులో పేర్కొన్నారు. సెక్షన్ 17A కింద ముందస్తు అనుమతి ఆవశ్యకతను కేవలం విధానపరమైన స్వభావంతో కాకుండా, వాస్తవికంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. సెక్షన్ 13(1) వంటి నిబంధనలలో ఉన్న నేరాలకు పునరాలోచనలో అలాంటి ముఖ్యమైన సవరణ వర్తించదని స్పష్టం చేశారు.
2018లో జరిగిన చట్ట సవరణలో పాత చట్టంలో ఉన్న 13(2) సెక్షన్‌లో 13(1)(సి), 13(1) (డి)లు పూర్తిగా తొలగించారన్నారు. ఏదైనా ఒక చట్టానికి సవరణలు చేసినప్పుడు ఆ చట్టం అమలు తేదీని ఖరారు అవుతుందని అంటే ఆ తేదీ తర్వాత జరిగే నేరాలకు మాత్రమే అది వర్తిస్తుంది కానీ, అంతకు ముందు జరిగిన వాటికి కూడా అన్వయించుకోవడం సరైంది కాదన్నారు. సెక్షన్ 17A యొక్క లక్ష్యం నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగులను వారి అధికారిక విధుల నిర్వహణలో చేసిన సిఫార్సులు, తీసుకున్న నిర్ణయాల కోసం పోలీసుల వేధింపుల నుంచి రక్షించడం అని, నిజాయితీ లేని అవినీతి పరులైన ప్రభుత్వోద్యోగులకు ప్రయోజనం కల్పించడం సెక్షన్ 17A లక్ష్యం కాదని జస్టిస్ బేలా త్రివేది తన తీర్పులో తెలిపారు. ఈ కేసులో అప్పీలుదారు ఐపీసీ కింద ఇతర నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, ప్రత్యేక కోర్టు రిమాండ్ ఆర్డర్‌ను ఆమోదించడానికి పూర్తిగా దాని అధికార పరిధిలో ఉందన్నారు. ప్రత్యేక న్యాయస్థానం ద్వారా న్యాయపరమైన లోపం లేదన్న జస్టిస్ త్రివేది హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ, చంద్రబాబు పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ధర్మాసనంలోని ఇరువురు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులు ఇవ్వడంతో... ఈ కేసులో తదుపరి చర్యల కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ముందుకు పంపాలని ధర్మాసనంలో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ రిజిస్ట్రీని ఆదేశించారు.