Supreme court money laundering act: నగదు అక్రమ చలామణి నిరోధక చట్టాన్ని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. ఎవరినైనా జైలులో పెట్టడానికి దీన్ని ఆయుధంగా వాడుకోకూడదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు సూచించింది. అలా చేస్తే చట్టం విలువ తగ్గిపోతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.
Sc to Ed arrests: "వెయ్యి రూపాయలు, వంద రూపాయల కేసుల్లోనూ ఈ చట్టాన్ని ఉపయోగిస్తే చివరకు ఏం జరుగుతుంది? మీరు ప్రతివారినీ జైలులో పెట్టలేరు" అని ధర్మాసనం పేర్కొంది. రూర్ఖండ్‌కు చెందిన ఉషామార్టిన్ కంపెనీ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందానికి విరుద్ధంగా ఇనుప ఖనిజం రజనును ఎగుమతి చేస్తున్నట్టు ఈడీ కేసు పెట్టింది. దీన్ని సవాలు చేస్తూ ఆ కంపెనీ కింది కోర్టులను ఆశ్రయించినా ఊరట లభించకపోవడం వల్ల సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.