తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జగన్‌ బెయిల్ ఇప్పుడే రద్దు చేయాలా?' - సీబీఐ సహా ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు - జగన్‌ బెయిల్‌ రద్దు

SC notices to jagan
SC notices to jagan

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2023, 11:43 AM IST

Updated : Nov 24, 2023, 3:55 PM IST

11:38 November 24

ఎంపీ రఘురామ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం

Supreme Court Notices to Jagan : ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. జస్టిస్‌ అభయ్‌ ఎస్​. ఓఖా, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టగా.. రఘురామ తరఫున న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్‌ వాదనలు వినిపించారు. అక్రమాస్తుల కేసులో జగన్‌.. గత పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారని.. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చాక.. సాక్ష్యాలను చెరిపేస్తున్నారని రఘురామ తరఫు న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. ఆధారాలేమైనా ఉన్నాయా అని ధర్మాసనం ప్రశ్నించగా.. కేసు పూర్వాపరాలు, జరిగిన ఘటనలపై వివరాలను న్యాయవాది కోర్టుకు సమర్పించారు.

జగన్‌కు బెయిల్‌ మంజూరు చేసిన తర్వాత... దర్యాప్తు సంస్థలు ఉన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేయలేదని.. రఘురామ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. జగన్‌కు, సీబీఐకి మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరుగుతోందని తెలిపారు. పదేళ్లుగా బెయిల్‌పై ఉన్న జగన్‌... ట్రయల్ కోర్టు ముందు హాజరుకాకుండా శాశ్వత మినహాయింపు పొందారని వివరించారు. కేసు దర్యాప్తు మొదలై.. పదేళ్లయినప్పటికీ అభియోగాల నమోదు చేపట్టలేదని.. ఈ విషయంలో దర్యాప్తు సంస్థ మౌన ప్రేక్షక పాత్ర పోషిస్తోందని వాదించారు. ఇదే అంశాలను తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నప్పటికీ.. పరిగణనలోకి తీసుకోకుండా కొట్టివేసిందని బాలాజీ శ్రీనివాసన్‌ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.

తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సీబీఐ ఇంతవరకు సుప్రీంకోర్టులో సవాల్‌ చేయలేదని.. రఘురామ తరఫు న్యాయవాది గుర్తుచేశారు. ఇదే వ్యవహారంలో కేసు ట్రయల్‌ను హైదరాబాద్‌ నుంచి దిల్లీకి బదిలీ చేయాలని తాము వేసిన పిటిషన్‌ పెండింగులో ఉందని.. దానిలో ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్లు బాలాజీ శ్రీనివాసన్ కోర్టుకు వివరించారు. సీబీఐ కేసుల విచారణ తర్వాతే ఈడీ కేసుల విచారణ చేయాలని.. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈడీ కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేసిందని బాలాజీ శ్రీనివాసన్‌.. ధర్మాసనానికి వివరించారు.

ఈడీ పిటిషన్‌ పెండింగులో ఉందని బాలాజీ శ్రీనివాసన్‌ చెప్పగా.. ఇప్పుడే బెయిల్‌ రద్దు చేయాలా అని ధర్మాసనం ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని రఘురామ తరఫు న్యాయవాది కోరగా.. విచారణను హైదరాబాద్‌ నుంచి మార్చాలన్న పిటిషన్‌, ఈడీ వేసిన పిటిషన్‌కు.. బెయిల్ రద్దు పిటిషన్‌ను జతచేయాలని ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. ఈలోపు జగన్‌, సీబీఐ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. విచారణను వచ్చే ఏడాది జనవరి తొలి వారానికి వాయిదా వేసింది.

Last Updated : Nov 24, 2023, 3:55 PM IST

ABOUT THE AUTHOR

...view details