ఆధునిక భావాలున్న, సామాన్యుడి కోణంలో తీర్పు చెప్పే జడ్జిగా పేరొందారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్. ఆయన తీర్పులే కాదు.. ప్రతిభా, వ్యక్తిత్వాలూ ఉన్నతమే!
ఐఏఎస్ అవ్వాలనుకుని!
చిన్నప్పట్నుంచీ న్యాయశాస్త్రంపైనే ఆసక్తి. కాలేజీకి వచ్చేసరికి అర్థశాస్త్రం నచ్చడంతో.. దిల్లీ స్టీఫెన్స్ కాలేజీ నుంచి అర్థశాస్త్రంలో డిగ్రీ చేశారు. యూనివర్సిటీ టాపర్. "స్టీఫెన్స్‌లో క్లాస్‌మేట్స్ సివిల్స్‌కు సిద్ధమవుతుండటంతో నేనూ అటు వెళ్లాలనుకున్నా. ఐఏఎస్‌గా గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయొచ్చనుకున్నా. అప్పుడప్పుడూ డీయూ 'క్యాంపస్ లా సెంటర్'లో క్లాసులు వినేవాణ్ని. అవి న్యాయశాస్త్రంపైన మళ్లీ ఆసక్తిని కలిగించాయి. 'లా' ద్వారా అర్థవంతమైన చర్చలూ, సామాజిక సమతూకం సాధ్యమని ఇటు వచ్చా" అంటూ కాలేజీ రోజుల్ని గుర్తుచేసుకుంటారు. 'క్యాంపస్ లా సెంటర్' నుంచే 1982లో ఎల్‌ఎల్‌బీ, హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్‌ఎల్‌ఎమ్, జ్యురిడికల్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ చేశారు.
వాళ్లే స్ఫూర్తి
వినమ్రంగా ఉండటం నాన్న (వైవీ చంద్రచూడ్ సుప్రీంకోర్టు 16వ ప్రధాన న్యాయమూర్తి) నుంచి అలవర్చుకున్నానంటారు. 'హోదాకి గర్వం తోడైతే ఆలోచనలు పక్కదారి పడతాయి' అంటారు. భీమ్‌బాయి.. ముంబయిలో వీరింట్లో పనిమినిషి. 'ఆమె చదువుకోలేదు. కానీ చాలా కథలు చెప్పేది. ఆమె దగ్గరే విలువల గురించి తెలుసుకున్నా. తన ప్రభావం నామీద చాలా ఉంది. అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, అక్క.. వీళ్లే నా బలం. యోగా టీచర్ అనంత్ లిమాయే.. నా ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రేరణ. హార్వర్డ్‌లో క్రిమినల్ లా పాఠాలు చెప్పిన లోతిక సర్కార్, లింగ వివక్షకు వ్యతిరేకంగా పనిచేసిన అమెరికా సుప్రీంకోర్టు జడ్జి రూత్ బ్యాడెర్ గిన్స్‌బర్గ్.. నాకు స్ఫూర్తి' అని చెబుతారు.
అలా గుర్తుండిపోవాలి
న్యాయవ్యవస్థకు మానవీయతను జోడించిన జడ్జిగా గుర్తుండిపోవాలన్నదే లక్ష్యమంటారు జస్టిస్ చంద్రచూడ్. 'రాజ్యాంగాన్ని అధ్యయనం చేసే నిరంతర విద్యార్థిగా, సాంకేతికతతో న్యాయవ్యవస్థను ఆధునికీకరించి కోర్టు సేవల్ని సులభతరం చేసిన అధికారిగా గుర్తుండిపోవాలనుకుంటున్నా' అని చెబుతారు. ఈ- కమిటీ ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు తీర్పుల ప్రత్యక్ష ప్రసారం, కోర్టు ప్రొసీడింగ్స్ రికార్డింగ్.. లాంటి మార్పులు తెచ్చారు.