మూఢ నమ్మకాలు ఓ వ్యక్తి ప్రాణాల్ని బలిగొన్నాయి. ఓ కుటుంబానికి జీవనాధారం లేకుండా చేశాయి. పిడుగు పాటుకు గురైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించకుండా ఆవు పేడలో ముంచి చికిత్స అందించేందుకు యత్నించగా ప్రాణాలు కోల్పాయాడు. ఈ దుర్ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లాలో జరిగింది.
అసలేం జరిగింది?
లఖన్‌పుర్ తాలుకాలోని ముత్కి గ్రామానికి చెందిన కిషన్ రామ్ రాజ్వాడా(35) అనే వ్యక్తి.. మంగళవారం మధ్యాహ్నం వర్షం కురుస్తుండగా తన ఇంటి ముందు నిలిచిన నీళ్లను తీసేందుకు బయటకు వచ్చాడు. ఆ సమయంలో అతని భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఇంతలో అతడు పిడుగుపాటుకు గురయ్యాడు. పిడుగు శబ్దం విని కుటుంబ సభ్యులు అరవగా.. ఇరుగుపొరుగువారు, ఊరిపెద్దలు అక్కడకు చేరారు. తీవ్రంగా గాయపడ్డ అతణ్ని తక్షణమే ఆస్పత్రికి తరలించకుండా.. ఆవుపేడతో తమకు తోచిన చికిత్స అందించారు.