తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మరణం'పై కవితలు.. ఉరేసుకుని ఆత్మహత్య.. 'టాప్ ర్యాంక్' బాలికకు ఏమైంది? - విద్యార్థిని ఆత్మహత్య

Student suicide news: ఆమె వయసు 13.. 8వ తరగతి విద్యార్థి.. చదువులో టాప్ ర్యాంకర్.. ఆటలు, ఇతర అన్ని విషయాల్లోనూ చాలా యాక్టివ్. కానీ.. అనూహ్యంగా సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇలా చేయడానికి రెండు నెలల ముందు నుంచి ఆమె 'మృత్యువు'పై కవితలు రాస్తూ ఉండడం చర్చనీయాంశమైంది.

girl suiciding
'మరణం'పై కవితలు.. ఉరేసుకుని ఆత్మహత్య.. 'టాప్ ర్యాంక్' బాలికకు ఏమైంది?

By

Published : Apr 5, 2022, 11:15 AM IST

Student suicide news: 'మరణం'పై కొంతకాలంగా కవితలు రాస్తున్న ఓ బాలిక.. సోమవారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్ర నాగ్​పుర్​లో జరిగిందీ ఘటన. బాలిక మృతితో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అసలు ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

రెండు నెలలుగా కవితలు: పోలీసుల కథనం ప్రకారం.. మృతురాలి వయసు 13 సంవత్సరాలు. నాగ్​పుర్​ అజ్నీ ప్రాంతంలోని చంద్రమణి నగర్​లో కుటుంబంతో కలిసి ఉంటోంది. స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆమె తల్లి బాత్రూంలో ఉంది. సోదరుడు పక్క గదిలో ఉన్నాడు. బెడ్​రూమ్​లో ఉన్న ఆ బాలిక చదువుకుంటోందిలే అని అంతా అనుకున్నారు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. కాసేపటి తర్వాత తల్లి వచ్చి చూస్తే.. బెడ్​రూమ్​లోని ఓ చెక్క దూలానికి కట్టిన తాడుకు వేలాడుతూ శవమై కనిపించింది ఆ బాలిక.

కుటుంబసభ్యుల సమాచారంతో అజ్నీ ఠాణా పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. శవాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతురాలి గదిని పరిశీలించిన పోలీసుల దృష్టిని ఓ నోట్​బుక్​ ఆకర్షించింది. గత రెండు నెలలుగా ఆ బాలిక మృత్యువు గురించి మరాఠీ, ఇంగ్లిష్ భాషల్లో ఆ నోట్​బుక్​లో కవితలు రాస్తున్నట్లు వారు గుర్తించారు. 'కరోనా వ్యాపిస్తోంది.. నేను చనిపోవాలి' అని కూడా అందు​లో రాసి ఉందని పోలీసులు వెల్లడించారు.

తమ కుమార్తె ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఆమె బాగా చదివేదని, ఏటా స్కూల్​లో మంచి ర్యాంకులు సంపాదించేదని పోలీసులకు చెప్పారు. చివరిసారిగా తనతో మాట్లాడినప్పుడు బాలిక ప్రవర్తన పూర్తి సహజంగా ఉందని ఆమె తల్లి వాంగ్మూలం ఇచ్చింది. యాక్సిడెంటల్ డెత్ అని కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ కేసులో దర్యాప్తు సాగిస్తున్నారు.

విషాదాంతమైన విహార యాత్ర: మరోవైపు.. మధ్యప్రదేశ్​ సియోని జిల్లా జెన్వారా గ్రామంలో పిక్నిక్​కు వెళ్లిన ముగ్గురు టీనేజర్ల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సోమవారం సాయంత్రం నదిలో స్నానానికెళ్లిన ముగ్గురు.. నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అదే సమయానికి టిఫిన్​ తెచ్చేందుకు వెళ్లిన మరో బాలుడు.. తిరిగొచ్చాక ఈ విషయాన్ని గుర్తించి, స్థానికులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు మూడు గంటలు కష్టపడి మృతదేహాల్ని వెలికితీశారు. మృతులంతా 16ఏళ్ల వయసు వారని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details