సాగు చట్టాలకు సానుకూలంగా ఉన్న రైతులతో చర్చలు ఆపాలని కేంద్రాన్ని కోరారు ఆందోళన చేస్తున్న అన్నదాతలు. ఈ మేరకు కర్షకుల తరఫున కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్‌కు లేఖ రాసింది సంయుక్త కిసాన్ మోర్చా.
ఒకవైపు.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఆందోళన చేస్తుంటే.. మరోవైపు అన్నదాతల నిరసనలను నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని కేంద్రంపై ధ్వజమెత్తారు రైతు సంఘాల ప్రతినిధులు. కర్షకుల ఆందోళనలను దెబ్బతీసే ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని లేఖలో పేర్కొన్నారు మోర్చా సభ్యుడు దర్శన్ పాల్. చట్టాలు సవరిస్తామన్న కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన విషయాన్ని లేఖలో గుర్తుచేశారు.