దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన వేళ.. వైరస్‌ను తరిమికొట్టగల వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం మరింత విస్తరించింది. మే 1వ తేదీ నుంచి 18ఏళ్లు పైబడిన వారందరూ టీకాలు తీసుకోవచ్చని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై పలు రాష్ట్రాలు కీలక ప్రకటనలు చేస్తున్నాయి. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా టీకా ఖర్చులు తామే భరిస్తామని ప్రకటించాయి. ఇప్పటికే ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ఉత్తరప్రదేశ్, అసోం రాష్ట్రాలు ప్రకటించగా.. తాజాగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, బిహార్ కూడా ఈ జాబితాలో చేరాయి.
పౌరుల ప్రాణాలే లక్ష్యం..
మధ్యప్రదేశ్‌లో 18ఏళ్లు పైబడిన వారందరికీ మే 1 నుంచి ఉచితంగా టీకాలు అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. బుధవారం సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. 18ఏళ్లు పైబడిన వారందరి టీకా ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ వెల్లడించారు. పౌరుల ప్రాణాలను కాపాడేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్న ఆయన.. వ్యాక్సిన్లు సరిపడా అందుబాటులో ఉంచాలని కేంద్రాన్ని కోరారు.
మే ఒకటి నుంచి రాష్ట్రంలోని 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ ఉచితంగా టీకా అందిస్తామని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులో టీకా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.