Water taxi in Mumbai: ముంబయి వాసుల ప్రయాణ కష్టాలు తీర్చేందుకు సరికొత్త వాటర్ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇకపై ముంబయి నుంచి నవీ ముంబయికి నిమిషాల వ్యవధిలోనే వెళ్లవచ్చు. దీంతో గంటల సమయం ఆదా అవుతుంది. నెరుల్, బెలాపుర్, జేఎన్పీటీ, ఎలిఫాంటా కేవ్స్‌కు పావుగంటలోనే మెరుపువేగంతో దూసుకుపోవచ్చు. ప్రస్తుతం ముంబయి నుంచి ఈ ప్రాంతాలకు వెళ్లాలంటే గంటల సమయం పడుతోంది.
సాగర్మాలా కార్యక్రమంలో భాగంగా జలమార్గ ప్రయాణాలపై ప్రత్యేక దృష్టి సారించింది ప్రభుత్వం. మొత్తం 12 మార్గాల్లో వాటర్ ట్యాక్సీల సేవలను తీసుకొస్తోంది. కొద్ది రోజుల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. సంక్రాంతికే ఆయన ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఈ షెడ్యూల్‌కు సంబంధించి ప్రధాని కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ముంబయి పోర్టు ట్రస్టు, మహారాష్ట్ర జలమార్గ బోర్డు, CIDCO ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇన్ఫినిటీ హార్బర్ సర్వీసెస్, వెస్ట్ కోస్టు మరైన్ సంస్థలు ఈ ట్యాక్సీలను ఆపరేట్ చేస్తాయి.
High speed water taxi news
ఇన్ఫినిటీ హార్బర్ వద్ద ప్రస్తుతం 4 హై స్పీడ్ వాటర్ ట్యాక్సీలున్నాయి. వీటికి వరుసగా 50, 40, 32, 20 సీటింగ్ సామర్థ్యం కలదు. వెస్ట్‌కోస్ట్ మరైన్ కంపెనీ వద్ద 7 వాటర్ ట్యాక్సీలున్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 6, 10 సీటింగ్ సామర్థ్యం గల మరో రెండు ట్యాక్సీలను సిద్ధం చేస్తున్నారు.