తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన స్టాలిన్.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఈ దఫా ఎన్నికల్లో స్టాలిన్ 'మంత్రం' వల్ల డీఎంకే సాధించిన మరో చరిత్ర సర్వత్రా చర్చనీయాంశమైంది. దాదాపు 25ఏళ్లల్లో ఎన్నడూ లేని విధంగా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ స్వతంత్రంగా మెజారిటీ సాధించింది.
మొత్తం 234 సీట్లకు ఏప్రిల్ 6న ఎన్నికలు జరగ్గా.. ఈ నెల 2న ఫలితాలు వెలువడ్డాయి. మ్యాజిక్ ఫిగర్ 118 కాగా.. ఈసారి డీఎంకే 133 స్థానాలు కైవసం చేసుకుంది. అంటే మెజారిటీ కన్నా 15 సీట్లు ఎక్కువ. మొత్తం మీద.. డీఎంకే కూటమి 159 స్థానాల్లో గెలుపొందింది.
1996 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 173 సీట్లతో స్వతంత్రంగా మెజారిటీని అందుకున్న డీఎంకే.. ఈ విషయంలో 2021 ముందు వరకు డీలా పడింది.
200 మార్క్ మిస్...
1971లో జరిగిన ఎన్నికల్లో 184 సీట్లను వెనకేసుకుంది డీఎంకే. సీట్ల పరంగా.. ఆ పార్టీకి ఇప్పటివరకు ఇదే అతిపెద్ద రికార్డు. ఈ దఫా ఎన్నికల్లో ఆ రికార్డును తిరగరాస్తామని, 200కుపైగా శాసనసభ స్థానాల్లో గెలుస్తామని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. అనేక ఎగ్జిట్ పోల్స్ కూడా ఇంచుమించు ఇవే గణాంకాలను చూపించాయి కూడా! కానీ ఎన్నికల ఫలితాల్లో పరిస్థితి భిన్నంగా కనిపించింది. డీఎంకేకు 133 సీట్లు దక్కాయి.
ఇదీ చూడండి:-డీఎంకే సక్సెస్ మంత్ర.. 'స్టాలిన్'!