నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. ఎస్ఎస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(సీజీఎల్) 7,500 ఉద్యోగాలకు గానూ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్ బి, గ్రూప్ సీ పోస్టుల కోసం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలు నిర్వహించనుంది. డిగ్రీ అర్హతపై ఈ ఉద్యోగాల కోసం ఏప్రిల్ 3 నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ విభాగంలో అసిస్టెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ బ్యూరో సహా పలు శాఖల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పాటు పలు శాఖల్లో వివిధ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రూ.100ను ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు.
వయసు పరిమితి:01.08.2023 నాటికి ఖాళీలను అనుసరించి 18-27 ఏళ్లు, 20-30 ఏళ్లు, 18-30 ఏళ్లు, 18-32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు మూడేళ్ల పాటు వయో సడలింపు కల్పించారు.
ఉద్యోగ ఎంపిక విధానం: టైర్-1, టైర్-2 ఎగ్జామినేషన్, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్/ మెడికల్ టెస్టులు, సర్టిఫికెట్స్ పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.