జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలోని హరిపరిగామ్లో ప్రత్యేక పోలీసు అధికారి (ఎస్పీఓ) ఫయాజ్ అహ్మద్ ఇంటిపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆదివారం రాత్రి 11 గంటలకు ఎస్పీఓ ఫయాజ్ అహ్మద్ ఇంట్లోకి ముష్కరులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎస్పీఓ అహ్మద్ అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన ఆయన భార్య రాజాబేగం, కుమార్తె రఫియా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భద్రతాదళాలు ముష్కరుల కోసం గాలిస్తున్నాయి.
అధికారులు.. ఫయాజ్ అహ్మద్ కుటుంబ సభ్యుల భౌతికకాయాలకు మత సంప్రదాయాలను అనుసరించి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు వందలాది మంది స్థానికులు హాజరై.. ఫయాజ్ కుటుంబ సభ్యులకు నివాళులర్పించారు.