Soumya Vishwanathan Murder Case :టీవీ జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నలుగురు దోషులకు జీవితఖైదు విధించింది దిల్లీలోని ఓ న్యాయస్థానం. ఐదో దోషికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. జీవితఖైదు పడ్డ రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మాలిక్, అజయ్ కుమార్‌కు రూ.1.25 లక్షల చొప్పున జరిమానా సైతం విధించారు అడిషనల్ సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ పాండే. ఐదో దోషి అజయ్ సేఠీకి రూ.7.25లక్షలు ఫైన్ విధించారు. దోషులు చెల్లించే రూ.12 లక్షలు బాధితురాలి కుటుంబానికి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ హత్యను అత్యంత అరుదైన ఘటనగా భావించడం లేదని, అందుకే ఉరి శిక్ష విధించడం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.
ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానల్లో పనిచేసే సౌమ్య 2008 సెప్టెంబర్ 30న హత్యకు గురయ్యారు. తెల్లవారుజామున 3 గంటలకు కారులో ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగివెళ్తున్న క్రమంలో దిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్‌లో దుండగులు ఆమెను అడ్డగించారు. దోపిడీకి యత్నించి.. ఆమెపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పుల్లో ఆమె ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ కేసులో ఐదుగుర్ని అరెస్ట్ చేయగా 2009 మార్చి నుంచి వారు జ్యూడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. అప్పటి నుంచి దీనిపై సుదీర్ఘ విచారణ జరగ్గా.. అక్టోబర్ 18న నిందితులందరినీ దోషులుగా తేల్చుతూ దిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది.
నాటు తుపాకీతో కాల్పులు..
ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం.. రవి కపూర్ తన వెంట తెచ్చుకున్న నాటు తుపాకీతో సౌమ్యపై కాల్పులు జరిపాడు. అమిత్ శుక్లా, అజయ్ కుమార్, బల్జీత్ మాలిక్.. సౌమ్య స్వామినాథన్ వెంట ఉన్నారు. రాబరీ కోసం వారు ఉపయోగించిన కారును.. ఐదో నిందితుడు అజయ్ సేఠీ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. దీంతో.. హత్య నేరం కింద నలుగురికి, నేరానికి సహకరించినందున అజయ్ సేథీకి శిక్ష విధిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.