గాంధీ కుటుంబీకులు కొవిట్ టీకా తీసుకున్నారా? అని భాజపా నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో స్పష్టత ఇచ్చింది కాంగ్రెస్. అధ్యక్షురాలు సోనియా గాంధీ కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్లు తెలిపింది. ఇతర అంశాలను లేవనెత్తుతూ గందరగోళం సృష్టించకుండా.. దేశ ప్రజలందరికీ టీకా పంపిణీలో రాజ ధర్మాన్ని పాటించాలని ప్రభుత్వానికి సూచించింది.
ప్రియాంకా గాంధీ తొలి డోసు తీసుకున్నారని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. రాహుల్ గాంధీ కరోనా నుంచి కోలుకున్నారని, వైద్యుల సూచన మేరకు సరైన సమయంలో టీకా తీసుకుంటారని స్పష్టం చేశారు.
"2021, డిసెంబర్ 31 నాటికి 100 కోట్ల ప్రజలకు టీకా అందించే లక్ష్యాన్ని చేరుకునేందుకు మోదీ ప్రభుత్వం ఎలాంటి గందరగోళం సృష్టించకుండా రోజుకు 80 లక్షల నుంచి కోటి మందికి టీకా అందించటంపై దృష్టిసారించాలి. టీకా పంపిణీలో ఆచరించాల్సిన రాజ ధర్మం ఇదే. హర్షవర్ధన్ భారత ఆరోగ్య శాఖ మంత్రి. కాంగ్రెస్ అధ్యక్షురాలు టీకా రెండు డోసులు తీసుకున్నారనే విషయాన్ని తెలిసి ఉండాలి. రాహుల్ గాంధీ 2021, ఏప్రిల్ 16న వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంది. అయితే.. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటం వల్ల ఏప్రిల్ 18న నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. కొవిడ్ నుంచి కోలుకున్నారు. వైద్యుల సలహా మేరకు టీకా తీసుకుంటారు."
- రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి.