Sonia Gandhi Raebareli: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తొలిసారి పాల్గొన్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. నాలుగో దశ ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన సోమవారం తన సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీ ప్రజలతో వర్చువల్‌గా మాట్లాడారు. భాజపా ప్రభుత్వంపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ప్రజా సమస్యలు పట్టవని దుయ్యబట్టారు. భాజపా హయాంలో ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని ధ్యజమెత్తారు. రాయబరేలీపై ఆ పార్టీ సవతితల్లి ప్రేమ కనబరుస్తోంది తప్ప.. వాస్తవానికి చేసిందేం లేదని ఆరోపించారు.
" ఈ ఎన్నికలు మీకు చాలా కీలకం. గత ఐదేళ్ల కాలంలో ప్రజలను విభజించడం తప్ప భాజపా ప్రభుత్వం చేసిందేమీ లేదు. రైతు సోదరులు కష్టపడి పంట పండిస్తే వాటికి సరైన ధర దక్కడం లేదు. అన్నదాతలకు ఎరువులు అందడం లేదు. సాగు నీటి సదుపాయం లేదు. అప్పుల్లో కూరుకుపోతున్నారు. జంతువులు పంటలను నాశనం చేస్తున్నా పట్టించుకునేవారే లేరు. బంగారు భవిష్యత్తు కోసం కష్టపడి చదువుకున్న యువత ఉద్యోగాలు లేక ఇంట్లోనే ఖాళీగా కూర్చుంటున్నారు. 12 లక్షల ప్రభుత్వ కొలువులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం వాటిని భర్తీ చేయడం లేదు. ఉద్యోగాలు ఇవ్వడం లేదు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. సామాన్యులు జీవనం సాగించడం కష్టతరమైంది."
-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి.
Sonia Virtual Rally