Sonia Gandhi health issues: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కొవిడ్ సంబంధిత సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. 'సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరికొన్ని రోజులు సోనియా ఆసుపత్రిలో ఉంటారు. ఆమె అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేయాభిలాషులకు ధన్యవాదాలు' అని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. మరోవైపు సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం సోనియా గాంధీ ఆసుపత్రికి వచ్చారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో జూన్ 8న ఈడీ ముందు విచారణకు సోనియా గాంధీ హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపించింది. కరోనాతో బాధపడుతున్న కారణంగా విచారణకు హాజరుకాలేనని.. మూడు వారాల గడువు ఇవ్వాలని సోనియా కోరారు. దీంతో ఈ నెల 23న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఈడీ తాజాగా సమన్లు జారీ చేసింది.