భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీస్తున్న వేళ.. సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన ఈ భేటీకి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరీ సహా ఇతర ఎంపీలు హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం సోనియా మీడియాతో మాట్లాడారు.
భారత్- చైనా సరిహద్దు సమస్యపై పార్లమెంట్‌లో చర్చకు అనుమతించకపోవడంపై సోనియాగాంధీ తీవ్రంగా మండిపడ్డారు. "మనపై దాడి చేయడానికి చైనా ఎందుకు ధైర్యంగా ఉంది? ఈ దాడులను తిప్పికొట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సన్నాహాలు చేపట్టింది? ఇంకా ఏం చేయాలి? భవిష్యత్తులో చొరబడకుండా చైనాను నిరోధించడానికి ప్రభుత్వ విధానం ఏమిటి? మనం తీవ్రమైన వాణిజ్య లోటు కలిగి ఉన్నాం. చైనాకు మనం ఎగుమతి చేసే దానికంటే దిగుమతులు ఎక్కువ చేసుకుంటున్నాం. చైనా సైనిక శత్రుత్వానికి ఆర్థిక ప్రతిస్పందన ఎందుకు ఇవ్వడం లేదు? భారత్- చైనా సరిహద్దు సమస్యపై పార్లమెంట్‌లో చర్చకు అనుమతి నిరాకరించడం.. మన ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడమే. తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం పట్ల కేంద్రం ఎందుకు మౌనం వహిస్తోంది?" అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సోనియా ప్రశ్నించారు.