ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ఇంటి వద్ద..పేలుడు పదార్థాలతో కూడిన కారు లభ్యమైన కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఛేదించనుంది. అయితే తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం స్పందించారు. పేలుడు పదార్థాలతో కూడిన కారు కేసును ఎన్ఐఏకు అప్పగించడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
"ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. పాలనా యంత్రాంగంపై విపక్షానికి విశ్వాసం లేదు. రాష్ట్ర యంత్రాంగం పనిచేయటం లేదని విపక్షం వారు నిరూపించాలని భావిస్తున్నారు. అదే నిజమైతే.. ఇంధనంపై పన్ను తగ్గించాలని రాష్ట్రాన్ని వారెలా డిమాండ్ చేస్తున్నారు? కారు యజమాని హిరేన్ మృతి కేసును మా ఉగ్రవాద వ్యతిరేక దళం ఛేదించి తీరుతుంది. లోక్సభ సభ్యుడు మోహన్ డేల్కర్ అనుమానాస్పద ఆత్మహత్యపైనా మా పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఏడుసార్లు దాద్రా నగర్ హవేలీ నుంచి ఎంపీగా ఎన్నికైన వ్యక్తి ముంబయిలో చనిపోతే.. విపక్షం ఎందుకు మౌనంగా ఉంటోంది?"