Aadhar Tips: ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి కాలేజీ చేరికల వరకు అన్నింటికీ తప్పనిసరి అయిన ఆధార్ (Aadhaar) భద్రత గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల కేంద్రం ఆధార్ ఫొటోకాపీలను ఎవరితో పంచుకోవద్దంటూ జారీ చేసిన ఆదేశాలు.. ఆ వెంటనే వాటిని ఉపసంహరించుకోవడం అనుమానాలను మరింత పెంచింది. భద్రతాపరంగా ‘ఆధార్’ సమాచారానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని భారత విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ (UIDAI) చెబుతోంది. అయినప్పటికీ.. మన ఆధార్ (Aadhaar)ను రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా మన తరఫున కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆధార్ ఇచ్చే ముందు వెరిఫై చేయాలి:ఎక్కడైనా ఆధార్ ఫొటోకాపీ సమర్పించే ముందు వివరాలను వెరిఫై చేయాలి. ఆధార్ అంటే చాలా మంది కేవలం కార్డుపై కనిపించే 12 అంకెల ప్రత్యేక సంఖ్య మాత్రమే అనుకుంటారు. ఆధార్ వెబ్‌సైట్‌కు వెళ్లి మీ ఆధార్ సంఖ్యను ఎంటర్ చేసి కీలక సమాచారం సరిగ్గా ఉందో లేదో వెరిఫై చేసుకోవచ్చు. ఇది ఇటు కార్డుదారులతో పాటు దాన్ని స్వీకరించే వారికి కూడా శ్రేయస్కరం. https://myaadhaar.uidai.gov.in/verifyAadhaar ఈ లింక్‌పై క్లిక్ చేసి ఆధార్‌ను వెరిఫై చేసుకోవచ్చు.
ఓటీపీని ఇతరులతో పంచుకోవద్దు: ఆధార్‌ను ధ్రువపరిచేందుకు ఓటీపీ (Aadhaar OTP) ఓ సులువైన మార్గం. ఓటీపీతో ఎక్కడి నుంచైనా ఆధార్‌ను అధీకృతం చేయొచ్చు. మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎవరితో పంచుకోవద్దు.https://myaadhaar.uidai.gov.in/verifyAadhaar ఈ లింక్‌పై క్లిక్ చేసి వివరాలు అందజేస్తే ఏ మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుందో వెంటనే తెలిసిపోతుంది.
డౌన్‌లోడ్ కాపీని డిలీట్ చేయడం మర్చిపోవద్దు: మీరు ఎక్కడైనా బయటి కంప్యూటర్లలో ఈ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసినట్లయితే.. దాని ప్రింటవుట్ తీసుకున్న తర్వాత ఆ ఫైల్‌ను డిలీట్ చేయాలి. అలాగే ఆధార్‌ను ఎప్పుడూ అధికారిక వెబ్‌సైట్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. eaadhaar.uidai.gov.in/genricDownloadAadhaarఈ లింక్‌పై క్లిక్ చేసి ఈ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.