ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్‌పై ఫోర్జరీ, నేరపూరిత కుట్ర తదితర ఆరోపణలపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌పై గుజరాత్ పోలీసులు వేగంగా కదులుతున్నారు. శనివారం ముంబయిలో తీస్తాను నిర్బంధంలోకి తీసుకున్న ఆ రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్).. ఆమెను రోడ్డు మార్గంలో అహ్మదాబాద్ తీసుకువచ్చి ఆదివారం నగర నేర విభాగానికి అప్పగించారు. వెంటనే ఆమె అరెస్టును ప్రకటించిన పోలీసులు.. న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. తీస్తాతో పాటు ఈ కేసులో శనివారం అరెస్టైన మాజీ డీజీపీ శ్రీకుమార్‌ను జులై రెండు వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.
ఈ సందర్భంగా పోలీసులు తనపై అమానవీయంగా ప్రవర్తించారని.. తన భుజం కమిలిపోయిందని తీస్తా పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. దీనికి ఏటీఎస్ డీఐజీ నేతృత్వం వహించనున్నారు. 2002 గుజరాత్ అల్లర్లపై మోదీ, తదితరులకు క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసిన వెంటనే క్రైంబ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ డి.బి.బరాడ్.. తీస్తా, మాజీ ఐపీఎస్ అధికారులు శ్రీకుమార్, సంజీవ్‌భట్‌లకు వ్యతిరేకంగా ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, తప్పుడు సాక్ష్యాలతో అమాయకులను ఇరికించే ప్రయత్నం.. తదితర ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు కూడా.. వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ.. పిటిషన్‌దారులైన తీస్తా, ఇతరులపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. దురుద్దేశపూర్వకంగా పిటిషన్లు వేశారని, విచారణ ప్రక్రియ దుర్వినియోగంలో భాగస్వాములైనవారందరిపైనా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ వ్యాఖ్యల ఆధారంగానే ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. సీతల్వాడ్, శ్రీకుమార్, భట్‌లు గుజరాత్ అల్లర్లపై వేసిన కమిషన్‌కు, ప్రత్యేక దర్యాప్తు బృందానికి, న్యాయస్థానాలకు సమర్పించిన ధ్రువపత్రాలను స్వాధీనం చేసుకొనే పనిలో ఉన్నామని నేరవిభాగం డీసీపీ చైతన్య తెలిపారు. ఈ నేరపూరిత కుట్రలో ఇంకా చాలా మంది భాగస్వామ్యం ఉందని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు.