Farmers protest latest news today: సాగు చట్టాలను రద్దు చేసిన క్రమంలో కనీస మద్దతు ధర, ఆందోళనల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు పరిహారం, కేసుల ఎత్తివేత వంటి పెండింగ్లో ఉన్న డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చించేందుకు సిద్ధమయ్యారు రైతులు. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది సంయుక్త కిసాన్ మోర్చా.
భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు శనివారం దిల్లీలో సమావేశమైన సంయుక్త కిసాన్ మోర్చా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రాకేశ్ టికాయిత్ తెలిపారు. కమిటీలో రైతు నేతలు బల్బీర్ సింగ్ రజేవాల్, అశోక్ దావ్లే, శివ కుమార్ కక్కా, గుర్నామ్ సింగ్ ఛదుని, యుధ్వీర్ సింగ్ ఉన్నట్లు చెప్పారు. డిసెంబర్ 7న ఉదయం 11 గంటలకు మరోమారు మోర్చా నేతలు సమావేశమవనున్నట్లు వెల్లడించారు.