Secunderabad Swapna lok fire accident: కనుచూపు మేరల్లో కమ్మేసిన పొగ. అగ్నికీలల్లా ఎగిసిపడుతున్న మంటలు. పారిపోయే దారిలేదు. సాయం చేసే నాథుడు లేడు. ఇలాంటి నిస్సహాయ స్థితిలో ప్రాణాలు కాపాడుకునేందుకు గదిలో దాక్కుని ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆరుగురు యువతీయువకులు నిన్న సాయంత్రం ఉద్యోగులంతా విధులు ముగించుకుని తిరిగి వెళ్లే సమయంలో సికింద్రాబాద్ స్వప్నలోక్‌లో చెలరేగిన మంటల్లో దాదాపు అందరూ ప్రాణాలతో బయటపడినా.. ఓ 15మంది మాత్రం పైఅంతస్తుల్లోనే ఉండిపోయారు.
Secunderabad Swapna lok fire accident Victims : భారీ క్రేన్ల సాయంతో పైకివెళ్లిన అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద వారిని బయటికి తీసుకువచ్చినా బాత్‌రూంలో దాక్కున్న ఆరుగురు యువతీయువకులు ప్రమీల, శివ, వెన్నెల, త్రివేణి, శ్రావణి, ప్రశాంత్ మాత్రం అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వీరందరిని క్రేన్ల సాయంతో కిందకు తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. దట్టమైన పొగ కారణంగా ఊపిరి ఆడకపోవటంతో అప్పటికే ఆరుగురు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.
యువతీయువకుల వివరాలు: మృతిచెందిన వారిలో వరంగల్ జిల్లా నర్సంపేట్ ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఉండగా మహబూబాబాద్‌కు చెందిన ఇద్దరు మరొకరు ఖమ్మం జిల్లాకు చెందిన వారున్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం టేకులతండాకు చెందిన శ్రావణి, దుగ్గొండి మండలం మర్రిపల్లికి చెందిన వెన్నెల, నర్సంపేట మండలం చంద్రయ్యపల్లికి చెందిన ఉప్పల శివ, మహబూబాబాద్ జిల్లా గూడురు మండలం సురేశ్‌నగర్ తండాకు చెందిన ప్రమీల, కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన ప్రశాంత్‌తో పాటు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శుద్ధపల్లికి చెందిన త్రివేణి పాతికేళ్ల లోపే వయసున్న ఈ యువతీయువకులంతా స్వప్నలోక్‌లో ఉన్న కాల్ సెంటర్ BM-5 కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. త్రివేణి తండ్రి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుండగా.. కుటుంబానికి చేదోడుగా ఉండేందుకు తాను ఉద్యోగం హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది.