దేశ రాజధాని దిల్లీలో అమానవీయ ఘటన జరిగింది. నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశాడు ఓ దుర్మార్గుడు. ప్రస్తుతం ఆ బాలిక విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతోంది. భల్స్వా డెయిరీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ దారుణం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బాధిత బాలికను గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. రాత్రంతా బాలిక కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. గురువారం ఉదయం 8 గంటలకు కుటుంబ సభ్యులకు పోలీసుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. బాలిక భల్స్వా చెరువు వద్ద అపస్మారక స్థితిలో ఉందని.. ప్రస్తుతం బాబు జగ్జీవన్ రామ్ హాస్పిటల్ చికిత్స పొందుతుందని వాళ్లకు సమాచారం అందింది. ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులకు బాలిక అత్యాచారానికి గురైందని తెలిసింది. తర్వాత బాధిత బాలిక పరిస్థితి మరింతగా విషమించింది. దీంతో ఆమెను అంబేడ్కర్ హాస్పిటల్కు తరలించారు. కాగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
మైనర్ కుమార్తె. 42 ఏళ్ల తండ్రి అత్యాచారం..
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. కన్న తండ్రే(42) మైనర్ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక గర్భం దాల్చిన తర్వాతే.. తండ్రి జరిపిన అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద అభియోగాలు నమోదు చేసి విచారణ చేపట్టారు.