six persons life imprisonment: ఝార్ఖండ్‌లోని లోహర్దగా జిల్లా సెషన్స్ కోర్టు(పోక్సో).. సామూహిక అత్యాచారం కేసులో ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. ఒక్కొక్కరికి రూ. 20,000 జరిమానాను విధించింది. 2020లో బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు రుజువు కావడం వల్ల న్యాయమూర్తి అఖిలేశ్ కుమార్ తివారీ ఈ తీర్పును శనివారం వెలువరించారు.
ప్రధాన నిందితుడు సుమిత్ అలియాస్ టైగర్ ఓరాన్ తన పుట్టిన రోజు పార్టీకి.. బాధితురాలిని పిలిచి తన ఐదుగురు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటన 2020 సెప్టెంబర్ 20న జరిగిందని పోలీసులు తెలిపారు. భండారా పోలీస్ స్టేషన్ పరిధిలోని జామ్‌గాయ్ గ్రామంలో ఈ దారుణానికి నిందితులు పాల్పడ్డారని వెల్లడించారు. ఈ ఆరుగురిని పోలీసులు అరెస్టు చేయగా తాజాగా న్యాయస్థానం వీరికి జీవిత ఖైదు విధించింది.
చాక్లెట్ ఆశచూపి..: ఐదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ కీచకుడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాజనందగావ్‌లో జరిగింది. 17 ఏళ్ల నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక ఆడుకుంటున్న సమయంలో నిందితుడు ఆమెకు చాక్లెట్ ఆశచూపి.. తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు అరవడం వల్ల అప్రమత్తమైన ఆమె తల్లి.. నిందితుడి ఇంటికి వెళ్లి ఆమెను రక్షించింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడిని అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టు ముందు పోలీసులు హాజరుపరచగా.. జువైనల్ హోమ్‌కు పంపాలని ఆదేశించింది.