మద్యం మత్తులో ఓ వ్యక్తి రాక్షసుడయ్యాడు. తప్పతాగి ఇంటికొచ్చి మృగంలా ప్రవర్తించాడు. కట్టుకున్న భార్య, కన్నబిడ్డలని కూడా చూడకుండా పెట్రోలు పోసి సజీవ దహనం చేశాడు. చుట్టపుచూపుగా వచ్చిన ఓ మహిళ, మరో చిన్నారి కూడా ఈ దారుణ ఘటనలో బలయ్యారు. కర్ణాటకలోని కొడగు జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
మద్యం మత్తులో ఇంటికి నిప్పు- ఆరుగురు సజీవదహనం - కొడగు
10:22 April 03
మద్యం మత్తులో ఇంటికి నిప్పు- ఆరుగురు సజీవదహనం
జిల్లాలోని పొన్నంపేటె తాలూకా ముగుటగేరి గ్రామంలోని కానూరు రహదారిలో మంజు అనే వ్యక్తి భార్య బేబీతో శుక్రవారం రాత్రి పోట్లాడాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లి అర్ధరాత్రి వరకు తప్పతాగి తిరిగి వచ్చాడు. తాను పిలిచినా భార్య బయటకు రాకపోవడంతో అతని కోపం అదుపుతప్పింది. మద్యం తాగి ఉండటంతో విచక్షణ మరిచిపోయాడు. ఇంటికి వెలుపలి నుంచి గడియపెట్టి పైకప్పు ఎక్కాడు. పెంకుల్ని తొలగించి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. మంటల్ని చూసిన ఇరుగుపొరుగువారు అతికష్టం మీద తలుపులు తెరిచారు. అప్పటికే బేబి (40), కుమార్తె ప్రార్థన (6), వారి బంధువు సీత (45) సజీవ దహనమయ్యారు. మంజు కుమారులు విశ్వాస్ (3), ప్రకాశ్ (7), బంధువుల కుమారుడు విశ్వాస్ (6) తీవ్రంగా కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా మైసూరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ ముగ్గురు చిన్నారులు కూడా చనిపోయారు.
పొన్నంపేటె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులు దుర్ఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఇదీ చదవండి:విషం తాగి అత్యాచార బాధితురాలు మృతి