బంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఏకధాటిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలు, వరదల ప్రభావంతో వివిధ ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
అసన్సోల్లో భారీ వర్షాలకు ఓ ఇల్లు కూలిపోయిన ఘటనలో ఐదేళ్ల బాలుడు మరణించాడని జిల్లా విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. బాలుడి తల్లి, సోదరి గాయపడ్డారని వెల్లడించింది. రఘునాథ్గంజ్, దక్షిణ 24 పరగణాలలో ఒక్కొక్కరు, బంకురా జిల్లా సిమ్లాపాల్, సోనాముఖిలలో మరో ఇద్దరు గోడ కూలి ప్రాణాలు విడిచారని అధికారులు స్పష్టం చేశారు. హావ్డాలోని దాస్నగర్లో విద్యుదాఘాతంతో 35 ఏళ్ల వ్యక్తి చనిపోయాడని చెప్పారు.