తెలంగాణ

telangana

ETV Bharat / bharat

TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం.. ప్రశ్నపత్రాల కోసం పొలాలు, నగలు తాకట్టు

SIT Inquiry in TSPSC Paper Leakage Issue : టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో... రోజురోజుకు విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశ్నాపత్రాలు దక్కించుకునేందుకు కొందరు పొలాలు కూడా తాకట్టుపెట్టినట్లు సిట్ విచారణలో తేలినట్లు తెలుస్తోంది. రేణుక, డాక్యా నాయక్‌ దంపతులు ప్రవీణ్‌ కుమార్‌కు రెండు దఫాలుగా 10 లక్షల రూపాయలు చెల్లించి... అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ప్రశ్నపత్రాలు కొనుగోలు చేశారని వెల్లడైంది.

TSPSC Paper Leakage Issue
TSPSC Paper Leakage Issue

By

Published : Mar 30, 2023, 8:07 AM IST

SIT Inquiry in TSPSC Paper Leakage Issue : టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల కోసం నిందితులు... పొలాలు, బంగారం తాకట్టు పెట్టినట్లు విచారణలో వెల్లడైంది. ప్రవీణ్‌కుమార్‌కు డబ్బు చెల్లించి ప్రశ్నపత్రాలు తీసుకున్న డాక్యానాయక్‌ వాటిని కె.నీలేష్‌నాయక్‌, పి.గోపాల్‌నాయక్‌లకు రాజేశ్వర్‌నాయక్‌ అనే మధ్యవర్తి ద్వారా... పదమూడున్నర లక్షలకు విక్రయించాడు. తిరుపతయ్య అనే మధ్యవర్తి ద్వారా రాజేందర్‌కుమార్‌కు 5లక్షలకు అమ్మాడు. ప్రశాంత్‌రెడ్డి నుంచి ఏడున్నర లక్షలు వసూలు చేశాడు. వారిలో నీలేష్‌నాయక్‌, గోపాల్‌నాయక్‌, రాజేందర్‌కుమార్‌లు తమ గ్రామాల్లోని పంటపొలాలను తాకట్టు పెట్టి డబ్బు చెల్లించినట్లు సమాచారం.

మరో 11 మందికి ఏఈ ప్రశ్నపత్రాలు : నీలేష్‌నాయక్‌, గోపాల్‌నాయక్‌లకు మేడ్చల్‌ ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేసిన శ్రీనివాస్‌ లక్ష రూపాయలు ఇచ్చినట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ప్రశాంత్‌రెడ్డి కూడా... నగలు తనఖా పెట్టి కొంత, అప్పుగా తెచ్చి మరికొంత కలిపి మొత్తం ఏడున్నర లక్షలిచ్చినట్లు తెలుస్తోంది. ఈ నలుగురికి కాకుండా... మరో 11 మందికి ఏఈ ప్రశ్నపత్రాలు చేరినట్లు సిట్‌ పోలీసులు అంచనాకు వచ్చారు. వారి వివరాలు... సేకరిస్తున్నారు. ప్రశ్నపత్రాల విక్రయాల్లో కీలకంగా వ్యవహరించిన... మరో ఐదుగురి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. వీరంతా మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన వారేనని తెలుస్తోంది.

ఉన్నతస్థాయికి చేరుకునేందుకు అడ్డదారి :గ్రూప్‌-1 పరీక్షలో 100కుపైగా మార్కులు సాధించిన... రమేశ్‌, సురేశ్‌, షమీమ్‌లను 5రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతివ్వడంతో వారిని చంచల్‌గూడ జైలు నుంచి... హిమాయత్‌నగర్‌లోని సిట్‌ కార్యాలయానికి తరలించారు. రమేశ్‌, షమీమ్‌లకు ప్రవీణ్‌కుమార్‌ ద్వారా, సురేశ్‌కు రాజశేఖర్‌రెడ్డి ద్వారా... ప్రశ్నపత్రాలు వచ్చినట్లు తొలిరోజు విచారణలో నిందితులు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కమిషన్‌లో కిందిస్థాయి ఉద్యోగులుగా ఉన్న తాము... ఉన్నతస్థాయికి చేరుకునేందుకు అడ్డదారిని ఎంచుకున్నట్లు షమీమ్‌ వెల్లడించినట్లు సమాచారం.

ప్రవీణ్ చెప్పిన దాంట్లో వాస్తవమెంత : గ్రూప్‌-1 ప్రశ్నాపత్రం తన కోసమే తీసుకున్నట్టు... ప్రవీణ్‌కుమార్‌ చెప్పాడు. అధిక మార్కులొస్తే కమిషన్‌లో అధికారులకు అనుమానం వస్తుందనే ఉద్దేశంతో తనను తానే డిస్‌క్వాలిఫై చేసుకునేందుకు వ్యక్తిగత వివరాలు నింపే ఓఎంఆర్ షీటుపై డబుల్‌ జంబ్లింగ్‌ చేశాడని... సిట్‌ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అయితే సిట్ విచారణలో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్‌ చెప్పిన అంశాలు... ఎంతవరకూ వాస్తవమనేది నిర్ధారించడం వారికి సవాల్‌గా మారింది. మరోవైపు గ్రూప్‌-1 రాసిన 20మంది ఉద్యోగులను మరోసారి ప్రశ్నించేందుకు సిట్‌ పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details