Sister Kidney Donation to Brother : మూత్రపిండం వైఫల్యంతో బాధపడుతున్న సోదరుడికి తన కిడ్నీని ఇచ్చి ప్రశంసలు అందుకుంటోంది ఓ యువతి. సోదరుడికి రక్షాబంధన్ కానుక అన్నట్లుగా.. శరీరంలోని ఓ భాగాన్నే దానం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. దిల్లీకి చెందిన హరేంద్ర(35) సేల్స్‌మన్‌గా పని చేస్తున్నాడు. గతేడాది నుంచి అతడికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. నీరసం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకున్నాడు.
అందులో హరేంద్ర కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తేలింది. 2022 డిసెంబర్ నాటికి అతడి పరిస్థితి మరింత దిగజారింది. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవడం తప్పనిసరైంది. అయితే, అతడి కంపెనీ వారానికి మూడు రోజులు సెలవు ఇచ్చేందుకు నిరాకరించింది. ఇక చేసేదేమీ లేక అతడు ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మానసికంగానూ కుంగిపోయాడు హరేంద్ర.
అయితే, హరేంద్ర అవస్థలను గుర్తించిన అతడి సోదరి ప్రియాంక(23) సాహసోపేత నిర్ణయం తీసుకుంది. తన అన్నకు కిడ్నీని దానం చేయాలని నిశ్చయించుకుంది. తొలుత ఈ నిర్ణయాన్ని కుటుంబసభ్యులంతా స్వాగతించారు. కానీ, భవిష్యత్‌లో ప్రియాంకకు ఏవైనా సమస్యలు వస్తాయన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. పిల్లల్ని కనే సమయంలో ప్రియాంక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసినవారు హెచ్చరించారు. కానీ ప్రియాంక మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. సోదరుడికి కిడ్నీ దానం చేసి తీరుతానని గట్టిగా చెప్పేసింది.
క్లిష్టమైన ఆపరేషన్..
దీంతో హరేంద్రకు ఆపరేషన్ నిర్వహించేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. అయితే, వారికి మరో సమస్య ఎదురైంది. ప్రియాంక కిడ్నీకి మూడు ధమనులు ఉండటం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. 'ఈ కిడ్నీ ఆపరేషన్ ప్రక్రియ సంక్లిష్టమైనది. ప్రియాంక మూత్రపిండానికి మూడు ధమనులు ఉన్నాయి. సాధారణంగా కిడ్నీలకు రెండు ధమనులే ఉంటాయి. కాబట్టి ఈ ఆపరేషన్ నిర్వహించడం కొంచెం కష్టం. ఇలాంటి కేసుల్లో నాళలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతుంటాయి' అని నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ పీపీ వర్మ, కన్సల్టెంట్ డాక్టర్ మెహాక్ సింగ్లా వివరించారు.