కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నప్పటికీ చాలా దేశాలు ఇప్పటికీ టీకా కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలతో పాటు ఇతర దేశాలను (Vaccine Maitri) ఆదుకునేందుకు భారత్ మరోసారి నడుం బిగించింది. వ్యాక్సిన్ మైత్రిలో భాగంగా ఇతర దేశాలకు వ్యాక్సిన్ డోసులు సరఫరా చేసేందుకు తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో భాగంగా నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్‌లకు 10లక్షల డోసుల చొప్పున కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను అందజేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అనుమతించింది. మరో ప్రముఖ సంస్థ భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ 10లక్షల డోసులను ఇరాన్‌కు (Vaccine Maitri) సరఫరా చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వీటితో పాటు పెద్ద మొత్తంలో కొవిషీల్డ్‌ను ఎగుమతి చేసేందుకు (Vaccine Maitri) సీరం ఇన్‌స్టిట్యూట్‌కు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా దాదాపు 3కోట్ల డోసులకు సమానమైన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్ బ్రిటన్‌కు సరఫరా చేయనుంది. దీనికి సంబంధించి యూకేతో ఒప్పందం కుదుర్చుకున్న దృష్ట్యా.. వ్యాక్సిన్ సరఫరాకు అనుమతివ్వాలని కోరుతూ సీరం ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ (ప్రభుత్వ, నియంత్రణ సంస్థల వ్యవహారాల విభాగం) ప్రకాశ్ కుమార్ సింగ్ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి ఇదివరకే విజ్ఞప్తి చేశారు.