మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కీలక దశకు చేరుకుంది. క్షణానికో పరిణామంతో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ బలపరీక్ష నిరూపణను సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది శివసేన. ఈ మేరకు శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు సర్వోన్నత న్యాయస్థానంలో పిల్‌ను దాఖలు చేశారు. సునీల్ ప్రభు తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సుప్రీంకు హాజరయ్యారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణను కోరుతూ.. శివసేన తరఫున వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల అనర్హత అంశం కోర్టులో ఉన్న నేపథ్యంలో బలపరీక్ష నిర్వహించడం చట్టవిరుద్ధం అని వివరించారు.
గురువారం ఉదయం 11 గంటలకు మెజారిటీ నిరూపించుకోవాలని 'అఘాడీ' సర్కారును గవర్నర్ ఆదేశించిన నేపథ్యంలో ప్రభు పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనాన్ని కోరారు అభిషేక్ సింఘ్వీ. ఈ నేపథ్యంలో అత్యవరస విచారణకు ధర్మాసనం అంగీకరించింది. 'సాయంత్రం ఐదు గంటలకు పిటినషన్ను విచారిస్తాం. మధ్యాహ్నం మూడు గంటలలోపు సంబంధిత పార్టీలు అన్ని పత్రాలను సమర్పించాలి' ధర్మానసం పేర్కొంది.