Shawarma ban Tamilnadu: కేరళలో షవర్మా తిన 16 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయిన ఘటనతో.. పొరుగు రాష్ట్రం తమిళనాడు అప్రమత్తమైంది. భారతీయ వంటకాల్లో భాగంగా కాని షవర్మా తినకుండా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సూచించగా.. వెల్లూరు జిల్లాలోని గుడియాథం మున్సిపాలిటీ మరో అడుగు ముందుకేసింది. మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరినీ సోమవారం సమావేశపరిచి.. షవర్మాపై నిషేధం విధించాలని నిర్ణయించింది.
"షవర్మాను పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువత ఇష్టంగా తింటారు. కానీ.. షవర్మా వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అందుకే గుడియాథం మున్సిపాలిటీ పరిధిలో షవర్మా అమ్మకాలను నిషేధిస్తున్నాం. అనారోగ్యకరమైన మాంసాహార వంటకాలు విక్రయించే దుకాణాలనూ సీజ్ చేస్తాం. కేరళలో షవర్మా తిని విద్యార్థి చనిపోయిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నాం" అని వివరించారు గుడియాథం మేయర్ సౌందరరాజన్.
తినకపోవడమే బెటర్: గుడియాథం మున్సిపాలిటీ ఈ తీర్మానం చేయడానికి ముందే.. షవర్మాపై కీలక వ్యాఖ్యలు చేశారు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్. "షవర్మా.. భారతీయ వంటకం కాదు. అది పశ్చిమ దేశాల ఆహారం. అక్కడి వాతావరణ పరిస్థితులకు అది సరిపోతుంది. ఆయా దేశాల్లో ఒక్కోసారి ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలలోకి పడిపోతుంది. షవర్మాను బయట అలానే వదిలేసినా పాడవదు. కానీ ఇక్కడ అలా కాదు. మాంసాహారాన్ని సరిగా నిల్వ చేయకపోతే పాడైపోతుంది. వాటిని తింటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి." అని అన్నారు సుబ్రమణియన్. అయితే.. షవర్మా పాశ్చాత్య దేశాల వంటకం అని మంత్రి చెప్పినా.. అది పశ్చిమాసియాకు చెందిన ఆహారం కావడం గమనార్హం.
షవర్మాపై ఎందుకీ రగడ?:
Shawarma death Kerala: కేరళలో ఈనెల 1న జరిగిన ఘటనే.. తమిళనాడులో షవర్మాపై ఇంతటి చర్చకు కారణం. కేరళ కాసరగోడ్ జిల్లాలో కలుషిత ఆహారం తిని ఓ 16 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. మరో 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఓ జ్యూస్ షాప్లో షవర్మా తిన్న తర్వాత వీరంతా అనారోగ్యానికి గురైనట్లు అధికారులు తెలిపారు. ట్యూషన్ కేంద్రానికి సమీపంలో ఉన్న ఆ షాపు యజమానిపై కేసు నమోదు చేశారు.