ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. డీఎంకే నేత ఎ.రాజా.. తమిళనాడు ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా పార్టీ పట్టించుకోలేదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలను బట్టి.. ఆ పార్టీ మహిళలకు వ్యతిరేకమని అర్థం అవుతుందని అన్నారు. తమిళనాడులోని తిరుకోయులూర్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు హోం మంత్రి.
గతంలో దివంగత సీఎం జయలలితపై ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలే చేశారని, ఏప్రిల్ 6న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు తల్లులు, సోదరీమణులు.. 'డీఎంకే'కు తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు అమిత్ షా. ఏం చేసైనా డీఎంకే ఈ సారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
''డీఎంకే నేత ఎ.రాజా చేసిన ప్రకటన నేను చూశాను. మరణించిన మహిళపై ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. నాకు తెలిసి డీఎంకేకు మహిళల పట్ల గౌరవం, మర్యాద ఏమాత్రం లేవు. ఎలాగైనా, ఏం చేసైనా ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది.''
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి.
అభివృద్ధి మార్గంలో నడుస్తున్న ఎన్డీఏ, అవినీతి, వారసత్వ రాజకీయాల్లో ఇరుక్కుపోయిన యూపీఏ మధ్యే ఈ ఎన్నికల సంగ్రామం జరుగుతోందని అన్నారు షా.