సీనియర్ భాజపా నేత, బంగాల్ మాజీ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆదివారం ఉదయం 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. కేసరినాథ్ మరణంపై ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు. ఈ విషయాన్ని కేసరినాథ్ తనయుడు నీరజ్ త్రిపాఠి వెల్లడించారు.
శ్వాస తీసుకోవడంలో సమస్యల వల్ల డిసెంబర్లో ఆయన ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం కేసరినాథ్ ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో ఆయన్ను ఇంటికి తీసుకొచ్చారు. అయితే, ఆదివారం ఉదయం మళ్లీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. ఈ క్రమంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆదివారం సాయంత్రం రసూలాబాద్ ఘాట్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి.
అలహాబాద్‌లో జన్మించిన కేసరినాథ్.. యూపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. రాష్ట్ర కేబినెట్ మంత్రిగానూ పనిచేశారు. 2014 నుంచి 2019 వరకు బంగాల్ గవర్నర్‌గా సేవలందించారు. బిహార్, మేఘాలయా, మిజోరం గవర్నర్‌గానూ ఆయన పనిచేశారు. ఉత్తర్‌ప్రదేశ్ భాజపా అధ్యక్షుడిగా కీలకంగా వ్యవహరించారు.
మోదీ సంతాపం..
కేసరిలాల్ మృతిపై భాజపా నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కేసరిలాల్ సేవలు, రాజ్యాంగపరమైన అంశాల్లో ఆయనకు ఉన్న పరిజ్ఞానం ఎనలేనివని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యూపీలో భాజపా బలపడటంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. కేసరిలాల్ కుటుంబానికి, శ్రేయోభిలాషులకు సానుభూతి ప్రకటిస్తున్నట్లు ట్వీట్ చేశారు. కేసరిలాల్ మృతి బాధాకరమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శ్రీరాముడి పాదాల వద్ద చోటు లభిస్తుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
కేసరినాథ్తో ప్రధాని మోదీ (పాత చిత్రం)