భారత ప్రధాన న్యాయమూర్తి(Cji of India) జస్టిస్ ఎన్.వి.రమణ (cji nv ramana news)అద్భుత పనితీరు కనబరుస్తున్నారని, నిజమైన రాజ్యాంగ సంరక్షుడి పాత్రను పోషిస్తున్నారని సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే పేర్కొన్నారు. లఖింపుర్ ఖేరి(lakhimpur kheri news) ఘటనపై శుక్రవారం విచారణ సందర్భంగా సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం వ్యవహరించిన తీరుపై.. ప్రముఖ పాత్రికేయుడు కరణ్‌థాపర్‌తో ఆయన ముఖాముఖి మాట్లాడారు.
"ఇంతకుముందు సీజేఐలుగా పనిచేసిన నలుగురు న్యాయమూర్తులు వ్యక్తులుగా మంచివారే. కానీ, రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించడంలో, సంరక్షకుడి పాత్రను పోషించడంలో విఫలమయ్యారు. లఖింపుర్ ఖేరి కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్.వి.రమణ ప్రజలకిచ్చిన సందేశం ఎంతో సానుకూలంగా ఉంది. దేశ ప్రజలకు నిజమైన కాపలాదారు సుప్రీంకోర్టేనని స్పష్టం చేశారు. అసాధారణ రీతిలో విచారణ చేపట్టి.. ఎంతో నమ్మకం కలిగించారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం, అధికారులు చట్టప్రకారం వ్యవహరించకపోతే, తాము ఉత్తర్వులు జారీచేస్తామన్న గట్టి సంకేతం ఇచ్చారు. సర్వోన్నత న్యాయస్థానాన్ని జస్టిస్ ఎన్.వి.రమణ ముందుండి నడిపిస్తూ, రాజ్యాంగానికి నిజమైన కాపలాదారుగా దాన్ని నిలిపారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు ఆయన పనిచేస్తుండటం నాకెంతో సంతృప్తి కలిగిస్తోంది. అధికారంలో ఉన్నవారు న్యాయ వ్యవస్థపై నిరంతరం ఒత్తిడి తెస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధంగా పనిచేసే న్యాయమూర్తులకు లాయర్లు అండగా నిలవాలి. తాను చేసిన రాజ్యాంగబద్ధ ప్రమాణానికి కట్టుబడి ఉన్నట్టు సీజేఐ రోజురోజుకూ నిరూపించుకుంటున్నారు"
- దుశ్యంత్ దవే, సీనియర్ న్యాయవాది