కరోనా నిబంధనలు పాటించకుండా నిర్లక్షం వహిస్తే దేశానికి మరో పెను సవాలు తప్పదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ హెచ్చరించారు. దేశంలో కరోనా రెండో దశ సమస్య ఇంకా సమసిపోలేదని తెలిపారు. దేశంలోని ఇంకా 80 జిల్లాల్లో వైరస్ పాజిటివిటీ రేటు అధికంగానే ఉందని పేర్కొన్నారు. భారత్లో తయారైన వ్యాక్సిన్లు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లపై సమర్థంగా పని చేస్తున్నాయని మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్(జీఓఎం) 29వ సమావేశంలో ఆయన మాట్లాడారు.
"మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, బంగాల్, ఒడిశాలో కరోనా కేసుల తీవ్రత అధికంగానే ఉంది. ఆయా రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే అధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా నిబంధనల పట్ల నిర్లక్ష్యం వహిస్తే దేశం పెద్ద సమస్యతో పోరాడాల్సి వస్తుంది.
- బలరాం భార్గవ, ఐసీఎంఆర్ డైరెక్టర్
కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో రోజువారీ మరణాలు దాటుతున్నాయని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం(ఎన్సీడీసీ) డైరెక్టర్ డాక్టర్ సుర్జీత్ సింగ్.. జీఓఎం సమావేశంలో తెలిపారు.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 40,845 మ్యూకర్మైకోసిస్ కేసులు వెలుగు చూశాయని జీఓం సమావేశంలో పాల్గొన్న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇప్పటివరకు ఈ వ్యాధి బారిన పడి 3,129 మంది మరణించారని చెప్పారు. దేశంలో కొనసాగుతున్న టీకా పంపిణీపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.