బంగాల్ శాసనసభ ఎన్నికల రెండో విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం 30 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. మొత్తం 171 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు.
గురువారం పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో నందిగ్రామ్ సైతం ఉండగా.. తుది ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ స్థానం నుంచి బంగాల్ సీఎం మమతా బెనర్జీ, భాజపా నేత సువేందు అధికారి, మహా కూటమి (వామపక్షం-కాంగ్రెస్-ఐఎస్ఎఫ్) నుంచి సీపీఎం నేత మీనాక్షి ముఖర్జీ పోటీపడుతున్నారు.
ప్రముఖుల పోరు
పశ్చిమ మేదినీపుర్‌లోని సబాంగ్ నియోజకవర్గంలో తృణమూల్ అభ్యర్థి మనాస్ రంజన్ భునియా పోటీ చేస్తుండగా.. భాజపా నుంచి అమూల్య మైతీ, ఎస్‌యూసీఐ(సీ) నుంచి హరేకృష్ణ మైతీ బరిలో ఉన్నారు.
ఖరగ్‌పుర్ సదర్ నియోజకవర్గంలో భాజపా నుంచి హిరన్మోయి ఛటోపాధ్యాయ, తృణమూల్ నుంచి ప్రదీప్ సర్కార్ పోటీ చేస్తున్నారు.
బంగాల్ రెండో విడత ఎన్నికల్లో కొంతమంది సినీ తారలు సైతం తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. చండీపుర్ నుంచి సయంతిక బెనర్జీ, బంకురా నుంచి సోహం చక్రవర్తి పోటీలో ఉన్నారు.