వారంతా ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. కరోనా కాలంలో అందరి మాదిరిగా.. బడులు మానేసి ఇళ్ల వద్దే ఉన్నారు. అయితే ఆ కాలాన్ని ఊరికే పోనివ్వలేదు. విదేశీ భాషలు నేర్చుకోవడానికి వాడుకున్నారు. సెల్ఫోన్లను సమర్థంగా ఉపయోగించుకొని.. పలు భాషల్లో ప్రావీణ్యం సాధించారు. వారే.. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మోర్షి మున్సిపల్ స్కూల్ విద్యార్థులు.
ఈ ప్రాథమిక పాఠశాలలో మొత్తం 237 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా ఆంగ్లంతో పాటు జపనీస్, ఫ్రెంచ్, జర్మన్, చైనీస్ భాషలను సులభంగా మాట్లాడుతున్నారు. విదేశీ భాషల పదాలు కఠినంగా ఉన్నా.. వాటిని అర్థం చేసుకోగలుగుతున్నారు. విద్యార్థుల ఈ పట్టుదల వెనుక ఆ పాఠశాల ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంది. పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు.. యూట్యూబ్ వీడియోలు చూసి ఆంగ్లం, ఇతర భాషలను ఎలా నేర్చుకోవాలో వారికి వివరించారు. గూగుల్ ట్రాన్స్లేట్ సహాయంతో విదేశీ భాషా జ్ఞానాన్ని ఎలా పెంపోదించుకోవాలో వారికి తెలియజెప్పారు. దీంతో ఆ విద్యార్థులు మొబైల్ ఫోన్‌లను చక్కగా ఉపయోగించుకోగించుకుని కొత్త భాషలను నేర్చుకున్నారు.