తనపై అత్యాచారం జరిగిందంటూ మానసిక వైకల్యం ఉన్న మహిళ చెప్పిన మాటలను విశ్వసించి గురువారం సుప్రీంకోర్టు ముద్దాయికి శిక్ష ఖరారు చేసింది. ప్రమాణం చేసి జరిగిందేమిటో కోర్టుకు వివరించే స్థితిలో లేకపోవడంతో ప్రశ్నలు-జవాబులు రూపంలో ఆమె నుంచి సమాచారాన్ని రాబట్టారు. ఆమె చెప్పిన మాటలు విశ్వసనీయమైనవేనని కేసును విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం చెప్పింది.
'అత్యాచారం కేసులో వారి మాట చెల్లుతుంది' - అత్యాచార కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఓ అత్యాచార కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న మహిళపై జరిగిన అత్యాచారం కేసులో ముద్దాయికి శిక్ష ఖరారు చేసింది. జరిగిన దానిని బాధితురాలు వివరించే స్థితిలో లేనప్పటికీ.. ప్రశ్న-సమాధానం రూపంలో సమాచారాన్ని రాబట్టి శిక్ష వేశారు.
ఉత్తరాఖండ్‌కు చెందిన 36 ఏళ్ల ఆ మహిళ 70 శాతం మేర మానసిక వైకల్యంతో బాధపడుతోంది. 2015లో సెప్టెంబరులో ఆమెపై అత్యాచారం జరిగింది. జరిగిన దాన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో లేకపోవడంతో ట్రయల్ కోర్టు ప్రశ్నలు-జవాబులు రూపంలో విచారణ జరిపింది. ఆ విధంగా తనను ఏమి చేశారో వివరించగలిగింది. విచారణ జరిపినప్పుడు మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రిల ఫొటోలను చూపిస్తే వారిని సరిగ్గానే గుర్తుపట్టింది. ఆ ప్రకారంగా నిందితున్ని గుర్తించగలిగింది. ఆమె సాక్ష్యాన్ని నమ్మిన కోర్టు నిందితునికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ 2016 అక్టోబరులో తీర్పు చెప్పింది. దీనిపై అతడు హైకోర్టును ఆశ్రయించగా ట్రయల్ కోర్టు తీర్పునే ఖరారు చేస్తూ 2019 మార్చిలో తీర్పు ఇచ్చింది. దానిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా జస్టిస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించింది. 'సాక్ష్యంలో కొన్ని పరస్పర విరుద్ధమైన అంశాలు ఉన్నాయి. అయితే మహిళ ఇచ్చిన సాక్ష్యం విశ్వసనీయమైనదే. ఈ ఒక్క కారణంగానే నిందితున్ని భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 376 (2)(1) కింద శిక్షించవచ్చు' అని తెలిపింది. మానసిక, శారీరక వైకల్యం ఉన్నవారిపై అత్యాచారాలు చేసే వారికి ఈ సెక్షన్ కింద శిక్షలు విధిస్తుంటారు. కేసు నమోదులో ఆలస్యం జరిగిందని, సంఘటన జరిగిన 20 రోజుల అనంతరం వైద్య పరీక్షలు జరగడం వల్ల సాక్ష్యాలు కనిపించకపోయి ఉండవచ్చని తెలిపింది. అయినప్పటికీ బాధితురాలు చెప్పింది నమ్మదగ్గదేనని పేర్కొంది.