మాజీ సైనికులకు 'ఒకే ర్యాంకు-ఒకే పింఛను' బకాయిలు చెల్లించేందుకు కేంద్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు మార్చి 15 వరకు గడువు ఇచ్చింది. అర్హులందరికీ సత్వరమే ఈ చెల్లింపులు చేయాలని, ఇకపై ఏమాత్రం జాప్యం జరగరాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. బకాయిల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే మాజీ సైనికులు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సూచించింది. బకాయిల చెల్లింపునకు గడువు కావాలని గత నెల కేంద్రం కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈమేరకు సానుకూలంగా స్పందించింది.
మార్చి 15కల్లా OROP బకాయిల చెల్లింపు.. కేంద్రానికి సుప్రీంకోర్టు గడువు
ఓఆర్ఓపీ బకాయిల చెల్లింపునకు గడువు ఇవ్వాలన్న కేంద్రప్రభుత్వ విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. మార్చి 15లోగా బకాయిలన్నీ అర్హులకు అందేలా చూడాలని స్పష్టం చేసింది.
ఈ కేసులో కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి.. సుప్రీం ఆదేశాలపై స్పందించారు. ఇప్పటికే బకాయిల లెక్కింపు ప్రక్రియ పూర్తయిందని, రక్షణ శాఖ తుది ఆమోదం తెలపాల్సి ఉందని నివేదించారు. మార్చి 15 నాటికి 25లక్షల మంది పింఛనుదారుల ఖాతాల్లో డబ్బు జమ కావడం ప్రారంభమవుతుందని అటార్నీ జనరల్ వివరించారు.
ఒకే ర్యాంకు-ఒకే పింఛను విధానం అమల్లోకి తెస్తున్నట్లు 2015 నవంబర్ 7న కేంద్రప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2014 జులై 1నుంచి ఈ విధానాన్ని వర్తింపచేస్తున్నట్లు నాటి ప్రకటనలో పేర్కొంది. అయితే.. పింఛను లెక్కింపుపై కేంద్రం ఫార్ములాను సవాలు చేస్తూ బాలాజీ శ్రీనివాసన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పింఛను ఎంత ఇవ్వాలో ప్రతి ఐదేళ్లకోసారి నిర్ణయించాలని ఆదేశించింది. ఈ తీర్పునకు అనుగుణంగా బకాయిల చెల్లింపునకు గతేడాది జూన్లో సుప్రీంకోర్టును మూడు నెలలు గడువు కోరింది కేంద్రం. ఇప్పుడు మరోమారు గడువు కోరుతూ కేంద్రం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. కోర్టు సానుకూలంగా స్పందించింది.