తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా పరిహారం కోసం అక్రమాలా? మరీ ఇంత అనైతికమా?' - కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం సుప్రీంకోర్టు

SC On Covid-19 Death Compensation: కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో అవకతవకలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు అనైతికమైనవని పేర్కొంది. అవసరమైతే ఈ వ్యవహారంపై కాగ్ దర్యాప్తునకు ఆదేశిస్తామని చెప్పింది.

supreme court
సుప్రీం కోర్టు

By

Published : Mar 14, 2022, 4:02 PM IST

Updated : Mar 15, 2022, 6:32 AM IST

SC On Covid-19 Death Compensation: కరోనా వల్ల కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి రక్తసంబంధీకులకు చెల్లించాల్సిన పరిహారంపై గత ఉత్తర్వులోనే స్పష్టమైన ఆదేశాలిచ్చామని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక్కో మరణానికి రూ.50వేల చొప్పున బాధిత కుటుంబానికి అందజేయాల్సి ఉంటుందని పేర్కొంది. అస్సాం నుంచి దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ బి.వి.నాగరత్న ధర్మాసనం సోమవారం ఈ విషయాన్ని తెలిపింది. మృతులకు ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఎంత పరిహారం ఇవ్వాలో స్పష్టత లేదంటూ పిటిషనర్‌ పేర్కొన్నారు. పిల్లలు ఎంత మంది ఉన్నప్పటికీ కుటుంబంలో ఒకరు చనిపోతే రూ.50వేలు, ఇద్దరు మరణిస్తే రూ.లక్ష అందజేయాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. తల్లిని, తండ్రిని కోల్పోయినట్లయితే...రెండు మరణాలుగా పరిగణించి రూ.లక్షను వారి సంతానానికి సమకూర్చాలని పేర్కొంది. తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన 10వేల మంది చిన్నారులను గుర్తించి వారికి పరిహారం అందజేయడంతో పాటు తగిన సహాయం అందజేయాలని జనవరి 19న అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

పరిహారం కోసం ఇంత అనైతికమా?

కరోనా మృతుల కుటుంబాలకు అందించే రూ. 50వేల పరిహారం పొందేందుకు కొందరు నకిలీ ధ్రువపత్రాలను సృష్టిస్తుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పథకాలు కూడా దుర్వినియోగం అవుతాయని అనుకోలేదని, నైతిక విలువలు ఇంతలా దిగజారాయని ఊహించలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఇదే విషయంపై అవసరమైతే కాగ్ దర్యాప్తునకు ఆదేశిస్తామని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కొవిడ్ -19 పరిహారాన్ని పొందేందుకు వీలుగా కొంతమంది నకిలీ ధ్రువపత్రాలను జారీ చేయడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. దీని వెనుక ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఉంటే తీవ్రంగా పరిగణించాలని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం మంజూరుకు ఒక నిర్దిష్ట కాల పరిమితిని నిర్దేశించాలన్న ప్రతిపాదనను ధర్మాసనం పరిశీలించాలని కోరారు. ఇలా చేస్తే నిజమైన అర్హులు గడువు మేరకు దరఖాస్తు చేసుకుంటారని తెలిపారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను మార్చి 21కి వాయిదా వేసింది.

కొవిడ్​-19 మృతుల కుటుంబాలకు సజావుగా పరిహారం అందేలా నోడల్ అధికారులను నియమించి పర్యవేక్షించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.

ఇదీ చూడండి:కొనఊపిరితో చిన్నారి.. పనిచేయని ఆక్సిజన్ యంత్రం.. డాక్టర్ ఐడియాతో...

Last Updated : Mar 15, 2022, 6:32 AM IST

ABOUT THE AUTHOR

...view details