COVID death ex gratia applications: కరోనా విపత్తులో అనాథలైన వారిని, కుటుంబ సభ్యులను కోల్పోయి తీవ్ర దుఖంలో మునిగిపోయిన వారిని పెద్ద మనసుతో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరిహారానికి అర్హులైన వారెవరైనా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోకుంటే రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (ఎస్‌ఎల్‌ఎస్‌ఏ)ల సభ్య కార్యదర్శులు వారిని గుర్తించి ప్రభుత్వ తోడ్పాటు అందేలా చూస్తారని పేర్కొంది. అందుకు అవసరమైన చర్యలన్నీ సమన్వయంతో సాగేందుకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ బి.వి.నాగరత్నల ధర్మాసనం ఆదేశించింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రెటరీ స్థాయి హోదాకు తగ్గని అధికారిని ప్రత్యేక నోడల్ ఆఫీసర్‌గా నియమించాలని స్పష్టం చేసింది. ఆ అధికారి న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శికి అందుబాటులో ఉంటూ అర్హులైన కొవిడ్ బాధితులు అందరూ పరిహారం కోసం దరఖాస్తు చేసుకునేలా చూడాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ విషయంలో క్షేత్ర స్థాయి సిబ్బంది సహకారాన్నీ సభ కార్యదర్శి తీసుకుంటారని తెలిపింది.
ఆఫ్‌లైన్ అభ్యర్థనలూ స్వీకరించాల్సిందే
కొవిడ్ పోర్టల్‌లో నమోదైన మృతుల వివరాలు, పరిహారం చెల్లింపులకు సంబంధించిన సమాచారమంతటినీ సమర్పించాలని ఇది వరకు ఆదేశించగా చాలా రాష్ట్రాలు గణాంకాలు మాత్రమే అందజేశాయని ధర్మాసనం వెల్లడించింది. పరిహారం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించలేని బాధితులెవరైనా ఉంటే వారిని న్యాయ సేవాధికార సంస్థ సంప్రదించి దరఖాస్తు చేసుకునేలా చేయూతనందించే ఉద్దేశంతో ఆ ఆదేశాలు ఇచ్చినట్లు వివరించింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్ మృతుల వివరాలన్నిటినీ, కరోనా వల్ల అనాథలైన వారి వివరాలను న్యాయ సేవాధికార సంస్థలకు అందజేయాలని కోరింది. ఆఫ్‌లైన్‌లో సమర్పించే దరఖాస్తులను తిరస్కరించరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. పౌరుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేసింది. నిండు మనసుతో బాధితులకు సాయం చేయాలని సూచించింది. ఆఫ్‌లైన్‌లో అందిన దరఖాస్తులన్నిటినీ వారం రోజుల్లోగా సమీక్షించి పరిహారం అందజేయాలంది.