Pegasus Spyware: పెగసస్ స్పైవేర్ గత ఏడాది దేశ రాజకీయాలను కుదిపేసింది. దీనిపై వాస్తవాలను వెలికితీసేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ కమిటీ రిపోర్టు ఇవ్వగా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఇప్పటివరకు 29 ఫోన్లను పరిశీలించగా.. ఐదింటిలో ఒక మాల్‌వేర్ ఉందని గుర్తించినట్లు చెప్పారు. కానీ, అది పెగసస్ స్పైవేర్ అనే కచ్చితమైన రుజువు లభించలేదని ప్రధాన న్యాయమూర్తి వెల్లడించారు. అలాగే ఈ కేసుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని కమిటీ తెలిపినట్లు పేర్కొన్నారు.
పెగసస్‌కు సంబంధించి టెక్నికల్ కమిటీ 2 నివేదికలు, మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ మరో నివేదిక ఇచ్చారని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు. సీల్డ్ కవర్‌లో సమర్పించిన ఆ నివేదికను తెరిచిన సీజేఐ అందులో కొంత భాగం గోప్యతకు సంబంధించిన, ప్రైవేట్ సమాచారం ఉందన్నారు. చట్టవిరుద్ధమైన నిఘా, సైబర్ దాడుల నుంచి పౌరులను రక్షించడానికి కొత్త చట్టాలు తీసుకురావాలని జస్టిస్ రవీంద్రన్ సిఫార్సు చేసిందని సీజేఐ వెల్లడించారు. ఈ నివేదికను కోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు ప్రకటించారు.
ఇదీ వివాదం..
ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ రూపొందించిన ఈ స్పైవేర్‌ను కొన్ని దేశాలు వినియోగించుకొని.. రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టినట్లు గతేడాది జులైలో అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడం తీవ్ర దుమారానికి దారితీసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ నాయకులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సహా దేశంలోని దాదాపు 300 మంది ఫోన్లను పెగసస్‌తో హ్యాక్ చేసినట్లు అప్పట్లో ‘ది వైర్’ కథనం వెల్లడించింది. ఇది తీవ్ర వివాదం రేపడంతో పాటు పార్లమెంట్‌ను కూడా కుదిపేసిన విషయం తెలిసిందే. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే, ఈ ఆరోపణలను కేంద్రం ఎప్పటికప్పుడు తోసిపుచ్చింది. ఆ వార్తలు నిజం కాదని తెలిపింది. ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరగా.. పెగాసస్‌ను వినియోగించారా? లేదా? అన్నదానిపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది.