దేశంలో పరిశుభత్రపై కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు 'స్వచ్ఛ భారత్ మిషన్'. 2014లో ప్రారంభమైన ఈ కార్యక్రమం రెండో విడతకు 'స్వచ్ఛభారత్ అర్బన్ 2.0' పేరుతో ఏప్రిల్ 1న కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రజలకు పర్యావరణ హిత వస్తువుల వాడకం మీద అవగాహన పెంచేందుకు ప్రణాళికను రచించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం కొనసాగిస్తూనే ఆ స్థానంలో జూట్ బ్యాగ్‌ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనుంది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లకు గానూ రూ.1,41,678 కోట్లను బడ్జెట్లో కేటాయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా బర్తన్ బ్యాంక్ పేరుతో వంటింటి పరికరాలకు సంబంధించి రాగి, స్టీల్ సామాగ్రిని అందుబాటులో ఉంచనుంది. దీని ద్వారా ప్లాస్టిక్ వినియోగం కొంత మేరకు తగ్గించవచ్చని కేంద్రం భావిస్తోంది.
వేడుకల్లో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల స్థానంలో ఈ బర్తన్ బ్యాంక్‌ల నుంచి స్టీల్, రాగి సామగ్రిని అద్దెకు తెచ్చుకుని వినియోగించుకోవచ్చు.
సిమెంట్ ఉత్పత్తిదారుల సమాఖ్య, జాతీయ రహదారుల సంస్థలతో కేంద్రం ఒప్పందం చేసుకోనుంది. వేరుచేసిన ప్లాస్టిక్‌ను రోడ్ల నిర్మాణం, సిమెంట్ బట్టీల్లో వినియోగించాలన్నది ప్రభుత్వం ప్రతిపాదన.
అర్బన్ ఏరియాల్లో..
స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ (2.0)లో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణతో పాటు లక్ష కన్నా తక్కువ జనాభా ఉన్న పట్టణ స్థానిక సంస్థల్లో మురుగునీటి శుద్ధిపై కూడా దృష్టి సారిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యర్థాల నిర్వహణ, బయో రెమిడియేషన్ ద్వారా మహా నగరాల్లో గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేస్తామని తెలిపింది.
"అన్ని పట్టణాలను త్వరలో ఓడీఎఫ్ (ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ)గా చేయడం సహా త్రీ స్టార్ రేటింగ్‌తో స్వచ్ఛత ఉన్న ప్రాంతాలుగా మారుస్తాము. లక్ష కన్నా తక్కువ జనాభా ఉన్న పట్టణాలను వాటర్ ప్లస్ ధ్రవీకరణ ఉన్న ప్రాంతాలుగా మార్చేందుకు కృషి చేస్తాము."
-కేంద్రం