పీఎంసీ బ్యాంకు కుంభకోణం విచారణ కోసం శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ సతీమణి వర్షా రౌత్ ఈడీ ముందు హాజరయ్యారు. ప్రవీణ్ రౌత్ ఖాతా నుంచి రూ.55లక్షలు వర్షా రౌత్ అకౌంట్‌కు బదిలీ కావటంపై ఈడీ అధికారులు ప్రశ్నించారు.
జనవరి 5న వర్ష ఈడీ ముందు హాజరు కావాల్సి ఉండగా ఒక్కరోజు ముందే హాజరయ్యారు. వర్షా రౌత్‌కు గతంలోనూ ఈడీ రెండు సార్లు సమన్లు జారీ చేసింది. అయితే అనారోగ్య కారణాలు చూపి ఆమె హాజరు కాలేదు.
కేసు ఎందుకు?
గతంలో పీఎంసీ బ్యాంకు నుంచి ప్రవీణ్ రౌత్ రూ.95కోట్ల రుణం పొందారు. దాదాపు రూ. కోటీ 60 లక్షలు ప్రవీణ్ రౌత్ ఖాతా నుంచి అతని భార్య మాధురీ రౌత్ ఖాతాకు బదిలీ అయ్యాయి. రూ.55లక్షలు వడ్డీ కింద రెండు విడతల్లో వర్షా రౌత్‌కు ఇచ్చినట్లు ఈడీ విచారణలో తేలింది. 2010లో రూ.50లక్షలు, 2011లో మరో 5లక్షలు వర్షా రౌత్ అకౌంట్‌కు బదిలీ కావటంపై విచారించారు. ఈ డబ్బును తూర్పు దాదర్ ప్రాంతంలో ఓ ఫ్లాట్ కొనేందుకు వినియోగించారన్న దానిపైనా ఈడీ విచారణ జరిపింది.
అయితే ఈడీ చర్యలపై మండిపడ్డారు వర్షా రౌత్ భర్త సంజయ్‌రౌత్. సాధారణ గృహిణిని టార్గెట్ చేయటం 'పిరికి పందల చర్య' అని వ్యాఖ్యానించారు.
2019లో పీఎంసీ బ్యాంకు రూ.4,355కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు తేలగా ఆర్బీఐ ఆ బ్యాంకుపై ఆంక్షలు విధించింది.
ఇదీ చదవండి :సంజయ్ రౌత్ భార్యకు ఈడీ సమన్లు