Sanatana Dharma Remark Row : సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వెనక్కి తగ్గడం లేదు. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పేదేలేదంటూ మరోసారి స్పష్టం చేశారు. సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకున్నారు. కుల వివక్షపై స్టాలిన్‌ను చెన్నైలో విలేకరులు ప్రశ్నించగా.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఉదాహరణగా చెప్పారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి దేశ ప్రథమ పౌరురాలైన ముర్మును ఆహ్వానించకపోవడమే ఇందుకు సరైన ఉదాహరణ అని తెలిపారు. తాను హిందూ మతానికి వ్యతిరేకం కాదని.. కానీ, సనాతన ధర్మంలోని కుల వివక్షకు మాత్రమే వ్యతిరేకమని చెప్పారు.
అంతకుముందు సోమవారం మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్.. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను కేవలం హిందూ మతానికి మాత్రమే కాదని.. అన్ని మతాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కోయంబత్తూర్‌లో డీఎంకే, బీజేపీ మధ్య పోస్టర్ల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నగరంలో పోస్టర్లు అంటించారు.
స్టాలిన్, ఖర్గేపై కేసులు నమోదు
Sanatana Dharma Controversy : మరోవైపు ఉదయనిధి స్టాలిన్, ఆయన వ్యాఖ్యలను సమర్థించిన AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేపై కేసులు నమోదయ్యాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పేర్కొన్నందుకు ఉదయనిధి స్టాలిన్‌పై, ఆయన వ్యాఖ్యలను సమర్థించినందుకు ప్రియాంక్ ఖర్గేపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసినట్లు రాంపుర్ పోలీసులు తెలిపారు. మీడియా కథనాల ఆధారంగా న్యాయవాదులు హరీశ్ గుప్తా, రాంసింగ్ లోధి చేసిన ఫిర్యాదు మేరకు.. 295A, 153A సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.