Sada Binama Lands: రాష్ట్రంలో లక్షలాది మంది చిన్న, సన్నకారు రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు లేవు. రిజిస్టర్ కాని దస్తావేజుల ద్వారా భూములు కొనడం వల్ల పట్టాదారు పాసుపుస్తకాలు పొందలేకపోతున్నారు. 2014 వరకు భూములు కొన్నవారే సాదాబైనామాల క్రమబద్ధీకరణకు గతంలో అర్హులుగా ఉండగా 2021 వరకు కొనుగోలు చేసిన వారికీ ప్రభుత్వం అవకాశం కల్పించింది.
'ఇదేంది సిద్ధారెడ్డీ?' సాగు భూములు ఇళ్ల పట్టాలుగా మార్చి పంపిణీ - అడ్డుకున్న బాధిత రైతులు
దరఖాస్తు గడువును ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది. అయితే గడువులు పెంచుకుంటూ పోవడం తప్ప సాదాబైనామాల క్రమబద్ధీకరణ ఎప్పటికి పూర్తవుతుందో అంతుచిక్కడం లేదు. 1989 జూన్ నుంచి 2023 నవంబర్ మధ్య ఇలాంటి భూముల క్రమబద్ధీకరణపై 16 జీఓలు వెలువడ్డాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే మూడు జీఓలు ఇచ్చారు. 71 వేల 384 ఎకరాల క్రమబద్ధీకరణకు 3లక్షల మంది దరఖాస్తు చేసినట్లు నాలుగేళ్ల కిందట ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత దరఖాస్తుల స్వీకరణ, గడువు ముగింపు తేదీలు మారాయే కానీ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
మీసేవ కేంద్రాలు లేదా గ్రామ-వార్డు సచివాలయాల ద్వారా రైతులు దరఖాస్తు చేశాక క్రయ, విక్రయదారులను పిలిపించి తహసీల్దార్లు విచారణ చేయాలి. ఎసైన్డ్ భూముల బదలాయింపు నిషిద్ధ చట్టం, 1973-బీ పట్టణ భూపరిమితి చట్టం, 1976, ఇతర చట్టాల ప్రకారం నిబంధనల ఉల్లంఘన జరగలేదని నిర్ధారించుకున్నాక భూమి కొనుగోలును క్రమబద్ధీకరించి 13-బీ సర్టిఫికెట్ జారీ చేయాలి. అప్పుడు సాదా బైనామాలకు రిజిస్టర్డ్ దస్తావేజుకు ఉన్న విలువ వస్తుంది. భూమి యాజమాన్యపు హక్కు పత్రం, పట్టాదారు పాసు పుస్తకం లభిస్తాయి.