Rubella vaccination babies death: కర్ణాటక బెళగావి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రూబెల్లా టీకా తీసుకున్న ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
Karnataka Rubella vaccination babies
రామదుర్గ తాలుకాలోని సలఘల్లి ప్రాథమిక వైద్య కేంద్రంలో మొత్తం 21 మంది చిన్నారులకు వివిధ టీకాలు ఇచ్చారు. నలుగురికి రూబెల్లా వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. రూబెల్లా టీకా తీసుకున్న ఈ నలుగురు చిన్నారులు తీవ్రంగా జబ్బుపడ్డారు. రామదుర్గ తాలుకా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు. వీరిని పవిత్ర హులగుర్(13 నెలలు), మధు ఉమేశ్ కురగుండి(14 నెలలు), చేతనగా (15నెలలు) గుర్తించారు. చేతన ఆదివారం కన్నుమూయగా.. జనవరి 12న పవిత్ర, జనవరి 15న మధు ప్రాణాలు కోల్పోయారు.
విచారణకు ఆదేశం..
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు బెళగావి డీహెచ్ఓ డాక్టర్ ఎస్వీ మునెయాల్ పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. ప్రాథమిక నివేదిక ప్రకారం చిన్నారులు టీకా దుష్ప్రభావాల వల్ల మరణించారని తేలిందని చెప్పారు. మరణించకముందు సేకరించిన చిన్నారుల మూత్ర, రక్త నమూనాలను ల్యాబరేటరీకి పంపినట్లు వివరించారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Rubella vaccination karnataka
వయోజనులకు, చిన్నారులకు ఒకే టీకా కేంద్రంలో వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. తల్లిదండ్రులు భయపడొద్దని, చిన్నారులకు టీకా వేయించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:కల్తీ మద్యం ఘటనలో 11కు చేరిన మృతులు