మహాత్మ గాంధీ 'కాంగ్రెస్'కు పునరుజ్జీవం పోయడం ద్వారా మాత్రమే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించగలమని తనకు చాలా ఆలస్యంగా అర్థమైందని అన్నారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్. నీతీశ్ కుమార్, జగన్ మోహన్ రెడ్డి వంటి వారికి తమ లక్ష్యాల్ని సాధించేందుకు సాయపడడం కన్నా కాంగ్రెస్ పునరుజ్జీవం కోసం పని చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. బిహార్‌లో 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న పీకే.. పశ్చిమ చంపారన్ జిల్లా లౌరియాలో ఈ వ్యాఖ్యలు చేశారు.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమలదళం విజయయాత్రను అడ్డుకోవడంలో విపక్షాల కూటమి సమర్థతపై ప్రశాంత్ కిశోర్ అనుమానాలు వ్యక్తం చేశారు. భాజపాను అర్థం చేసుకోలేనిదే ఆ పార్టీని ఓడించలేరంటూ తనదైన శైలిలో విశ్లేషించారు. "మీరు ఎప్పుడైనా కాఫీ కప్పును చూశారా? పైనంతా నురగ ఉంటుంది. భాజపా అలాంటిదే. కింద భాగంలో.. వేళ్లూనుకున్న ఆర్ఎస్ఎస్ ఉంటుంది. సామాజిక వ్యవస్థలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భాగమైపోయింది. షార్ట్కట్స్తో దానిని ఓడించలేరు. గాడ్సే సిద్ధాంతాన్ని.. గాంధీజీ కాంగ్రెస్‌కు పునరుజ్జీవం పోయడం ద్వారా మాత్రమే జయించగలం" అంటూ మహాత్ముడ్ని చంపిన గాడ్సేకు, ఆర్ఎస్ఎస్కు సంబంధం ఉందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు పీకే.
కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నిజానికి ఆయన గతేడాదే కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా ఊహాగానాలు వినిపించాయి. ఆ పార్టీ అగ్రనేతలతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. అయితే.. ఆ చర్చలు ఫలించలేదు. పీకే కాంగ్రెస్‌లో చేరలేదు. కాంగ్రెస్‌పై ఇప్పటికీ తనకు అభిమానం ఉందని.. కానీ మహాత్మ గాంధీ నేతృత్వంలోని పార్టీ తరహా పరిస్థితి ఉండాలని వ్యాఖ్యానించారు.